ఆల్క‌హాల్ ను జీఎస్టీ నుండి మిన‌హాయించాలి

ఆల్క‌హాల్ ను జీఎస్టీ నుండి మిన‌హాయించాలి

న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవడం సమంజసం కాదన్నారు మంత్రి హ‌రీష్ రావు. శుక్ర‌వారం జ‌రిగిన‌ 43వ జీఎస్టీ స‌మావేశంలో పాల్గొన్నారు మంత్రి హరీష్. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న ..జీఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలకు వదిలినవి ఎక్సైజ్, పెట్రోల్, డిజీల్ మాత్రమే అన్నారు. కేంద్రానికి ఎక్కువగా ఆదాయం వస్తోంది సెస్ , సర్ ఛార్జీల‌ రూపంలోనే అన్నారు. గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూలో 18శాతం సర్ చార్జి, సెస్ ల రూపంలో వస్తోందన్నారు. 22.17 లక్ష కోట్ల బడ్జెట్‌లో 3.99 లక్షల  కోట్ల ఆదాయం సెస్, సర్వీస్ ఛార్జీల ద్వారా సమకూరిందని తెలిపారు.

రాష్ట్రాలు 1.64 లక్షల కోట్లు  అంటే 41 శాతం ఆదాయం కేంద్ర వసూలు చేస్తోన్న సెస్ లు , సర్ ఛార్జిల ద్వారా కోల్పోతున్నాయని.. తెలంగాణ రాష్ట్రం ప్రతీ ఏటా3439. కోట్లు అంటే 2.102 శాతం ఆదాయం కోల్పోతుందన్నారు. ఆల్కహాల్ ను అన్ని రాష్ట్రాల మంత్రులు కోరుతున్నట్లు జీఎస్టీ నుండి మినహాయించాలన్నారు. జీఎస్టీలో‌ చేర్చితే రాష్ట్రాలు ఆదాయం కోల్పోతాయని.. జీఎస్టీ పరిధి నుండి శాశ్వతంగా న్యూట్రల్ ఆల్కహాల్ ను మినహాయించేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రి హ‌రీష్ రావు తెలిపారు.