జులైలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 72% డెలివరీలు

జులైలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 72% డెలివరీలు

హైదరాబాద్​, వెలుగు: జులై నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 72.8%గా నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్రలో ఇది సరికొత్త రికార్డ్ అని వ్యాఖ్యానించారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. వైద్యారోగ్య శాఖ పరిధిలోని వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు, పనితీరుపై మంత్రి హరీశ్ రావు గురువారం సమీక్ష నిర్వహించారు. వీసీ ద్వారా నిర్వహించిన సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్​ఎంఎస్​ఐడీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, అన్ని జిల్లాల వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటుకు ముందు 30 శాతం డెలివరీలు జరిగితే, ప్రస్తుతం 73 శాతానికి చేరడం సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో వైద్యారోగ్య శాఖ చేస్తున్న పనితీరుకు, పురోగతికి నిదర్శనం అన్నారు. అత్యధికంగా నారాయణ్ పేట్ జిల్లాలో 86.9%, మెదక్ జిల్లాలో 83.5%, జోగులాంబ గద్వాల జిల్లాలో 81.1% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయన్నారు. వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నిర్మల్ జిల్లాల్లో తక్కువగా నమోదవుతున్నాయని, ఇక్కడ ఫలితాలు మెరుగు పడాలని మంత్రి ఆదేశించారు.ఓవరాల్ పెర్ఫార్మెన్స్ విషయంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జోగులాంబ గద్వాల, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాలను మంత్రి అభినందించారు. చివరి స్థానంలో ఉన్న హనుమకొండ, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పనితీరు మెరుగుపడాలని ఆదేశించారు. 

టిఫా స్కానింగ్​తో గర్భిణులకు ఎంతో మేలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్ల వల్ల గర్భిణులకు ఎంతో మేలు జరుగుతున్నదని మంత్రి హరీశ్​రావు తెలిపారు. 43 ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన 56 టిఫాల ద్వారా 32 వేల స్కానింగ్​లు చేయడం అభినందనీయం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలకు ఏడాది కాలంలో రూ.కోటి 60 లక్షలు ఇన్సెంటివ్ ఇచ్చామన్నారు.

కుట్రలను ఛేదించిన పాలమూరు మంత్రి హరీశ్ రావు ​ట్వీట్

పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ స్కీంకు పర్యావరణ అనుమతులు రావడంపై మంత్రి హరీశ్​రావు ట్విట్టర్​లో హర్షం వ్యక్తం చేశారు. కుట్రలను ఛేదించి కేసులను అధిగమించి, దశాబ్దాలుగా అన్యాయానికి గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగు పరుగున రానుందని తెలిపారు. పాలమూరు పర్యావరణ అనుమతులు సాధించడం సీఎం కేసీఆర్ సాధించిన మరో చారిత్రక విజయమని హరీశ్​రావు అన్నారు.  సీఎం కేసీఆర్​ మొక్కవోని దీక్షకు ప్రభుత్వం పట్టువిడవని ప్రయత్నం తోడై సాధించిన ఫలితమిది అని తెలిపారు. ఇది పాలమూరు బిడ్డల దశాబ్దాల కల సాకారమైన సందర్భమన్నారు.