వైద్య రంగంలో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాం: హరీశ్ రావు

వైద్య రంగంలో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాం: హరీశ్ రావు
  • వైద్య రంగంలో దేశంలోనే..మూడో స్థానంలో ఉన్నాం
  • ఎల్లారెడ్డిలో వంద పడకల హాస్పిటల్ శంకుస్థాపనలో హరీశ్ రావు
  • జూన్​ 24 నుంచి పోడు పట్టాలిస్తామని వెల్లడి

ఎల్లారెడ్డి, వెలుగు : వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని హెల్త్​ మినిస్టర్​ హరీశ్‌‌ రావు అన్నారు. ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ సేవల వరకు అన్నీ ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. గతంలో ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో ఒక్క డయాలసిస్​ కేంద్రం కూడా ఉండేదని కాదన్నారు. ఇప్పుడు ప్రతీ నియోజకవర్గంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. పేషెంట్లకు ఫ్రీ బస్​పాస్, పెన్షన్​ కూడా ఇస్తున్నామన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మంత్రి హరీశ్​రావు వంద పడకల హాస్పిటల్​కు శంకుస్థాపన చేశారు. తర్వాత గండిమాసానిపేట్‌‌లో నిర్మించిన బస్తీ దవాఖానాను ప్రారంభించి మాట్లాడారు. ఈ ఏడాది కామారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజ్ ప్రారంభం అవుతుందని, ట్రీట్​మెంట్ కోసం హైదరాబాద్ పోవాల్సిన అవసరం ఉండదన్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలతో మెడికల్ కాలేజ్ ప్రారంభమవుతున్నదని తెలిపారు. వందకు 63శాతం డెలివరీలు గవర్నమెంట్​ హాస్పిటల్స్​లోనే జరుగుతున్నాయన్నారు. కేసీఆర్​ కిట్​తో పాటు గర్భిణులకు న్యూట్రిషన్​ కిట్​లు కూడా అందిస్తున్నామని వివరించారు.

ప్రతి నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్

తెలంగాణలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని హరీశ్ రావు అన్నారు. దీంతో ట్రైబల్ స్టూడెంట్స్​కు మెడిసిన్​ చదివే అవకాశం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్ నిర్మిస్తున్నామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే సురేందర్ కృషి కారణంగానే ఎల్లారెడ్డికి వంద పడకల హాస్పిటల్ మంజూరైందన్నారు. జూన్​ 24 నుంచి పోడు భూములకు పట్టాలు అందించబోతున్నామని ప్రకటించారు. పట్టాలతో పాటు రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సురేందర్, కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్ శోభ, హాస్పిటల్​ సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.