
ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. 'ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అందుకు తగ్గటుగా వారి సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో వేతనాల పెరుగుదలకు, సకాలంలో వేతనాలు పొందేందుకు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు.. ధర్నాలు, నిరసనలు చేయాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం అలాంటి అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక మూడు సార్లు వేతనాలు పెంచి, ప్రస్తుతం రూ. 9750 ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే, ఇతర మహిళా ఉద్యోగులకు ఇస్తున్నట్లుగానే ఆశా కార్యకర్తలకు, సెకండ్ ఏఎన్ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేలా సమగ్ర అధ్యయనం చేసి రిపోర్టు అందించాలని హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతిలను మంత్రి ఆదేశించారు.