ఏఎన్‌ఎంలకు హరీశ్‌రావు  క్షమాపణ చెప్పాలె: ఎంపీ ఆర్‌‌.కృష్ణయ్య డిమాండ్

ఏఎన్‌ఎంలకు హరీశ్‌రావు  క్షమాపణ చెప్పాలె: ఎంపీ ఆర్‌‌.కృష్ణయ్య డిమాండ్

హైదరాబాద్, వెలుగు : కోఠిలోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ క్యాంపస్‌లో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంలు సోమవారం ధర్నాకు దిగారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు ఎంపీ.ఆర్‌‌.కృష్ణయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరై సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎంలు మాట్లాడుతూ..16 ఏండ్లుగా తక్కువ జీతాలకు పనిచేస్తున్నా తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులరైజ్ చేయాలని కోరడానికి వెళ్తే మంత్రి హరీశ్‌రావు తమను అవమానించేలా మాట్లాడారని వాపోయారు.

జీతాలు చాలకపోతే ఈ పని మానేసి వేరే పని చేసుకోపోండి అని మంత్రి మండిపడినట్లు నేతలకు వివరించారు.ఇందుకు సంబంధించిన వీడియోను కూడా  వారికి చూపించారు. దీనిపై కృష్ణయ్య స్పందిస్తూ.. మంత్రి హరీశ్‌రావు వ్యవహరించిన తీరు ఏఎన్‌ఎంలను అవమానించేలా ఉందని ఫైర్ అయ్యారు. వారికి మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సెకండ్‌ ఏఎన్‌ఎంలందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలన్నారు.

రెండో ఏఎన్‌ఎం అనే పదంలోనే వివక్ష ఉందని కూనంనేని అన్నారు. రెగ్యులర్‌‌ ఏఎన్‌ఎంలకు ఇస్తున్న జీతంలో సగం కూడా ఎన్‌హెచ్‌ఎం ఏఎన్‌ఎంలకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అందరిని రెగ్యులరైజ్ చేసి.. ప్రభుత్వం మానవత్వం చాటుకోవాలని కూనంనేని పేర్కొన్నారు. కాగా..తమకు రూ.41 వేల వేతనం, రూ.10 లక్షల లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఏఎన్‌ఎంలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను 15 రోజుల్లో నెరవేర్చకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నరసింహ హెచ్చరించారు.