
హైదరాబాద్, వెలుగు: కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్ లేదా ఇంకొకరి నాయకత్వంలో పనిచేస్తానని హరీశ్ రావు చెప్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీశ్ చెప్పడంలో అర్థం లేదని తెలిపారు. ఫ్యామిలీ నుంచి ఎవరి నాయకత్వం అయితే తేడా ఏంటని ప్రశ్నించారు. బిల్లా అయినా.. రంగా అయినా ఏం తేడా లేదని ఎద్దేవా చేశారు. జలసౌధలో ఇరిగేషన్ శాఖపై రివ్యూ అనంతరం బుధవారం అర్ధరాత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.
‘‘దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చేయలేదు కాబట్టి.. ఇప్పుడు దళితునికి నాయకత్వం ఇస్తే మేలని అనుకోవాలి. కేసీఆర్ ఎలాగూ అసెంబ్లీకి రావడం లేదు. దళితుడికి ప్రతిపక్ష నేత పదవి ఇస్తే బాగుంటుంది. దళితులకు నాయకత్వం ఇచ్చి వారికి ఆ కుటుంబం విధేయతగా ఉండాలి’’అని రేవంత్ రెడ్డి అన్నారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నందున తాము గాంధీ కుటుంబంతో సమానంగా గౌరవం ఇస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.