V6 News

వడ్లు కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్రు : మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు

వడ్లు కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్రు : మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు
  • సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి కుర్చీ కాపాడుకునేందుకే ఢిల్లీ పోతుండు
  • సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు

హాలియా, వెలుగు : ‘ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్వింటాల్‌‌‌‌కు 7 కిలోల కోత విధిస్తూ, ధర తగ్గిస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది, నల్గొండ జిల్లాలో మిల్లర్లు అవకతవకలకు పాల్పడుతున్నారు’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా గుర్రంపోడ్‌‌‌‌ మండల కేంద్రంలో ఆదివారం జరిగిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకే ఢిల్లీకి పోతున్నారని విమర్శించారు.

ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్‌‌‌‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని, అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’  అనే మాటే వినిపిస్తోందని చెప్పారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో ప్రారంభించిన ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ టన్నెల్‌‌‌‌ను పూర్తి చేయడంలో కాంగ్రెస్‌‌‌‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సొరంగంలో ఇరుక్కుపోయిన కార్మికుల మృతదేహాలను సైతం వెలికి తీయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, వడ్ల బోనస్‌‌‌‌ వంటి హామీలు కూడా అమలుకాలేదన్నారు. సమావేశంలో మాజీమంత్రి శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌, ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా అధ్యక్షుడు రమావత్‌‌‌‌ రవీంద్రకుమార్‌‌‌‌, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్‌‌‌‌కుమార్‌‌‌‌, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.