బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకు కాంగ్రెస్ స్టిక్కర్లు : హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకు కాంగ్రెస్ స్టిక్కర్లు : హరీశ్‌‌‌‌‌‌‌‌రావు
  • రెండేండ్లలో చేసిందేం లేక కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్: హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే.. వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో నిర్మించిందేం లేక కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణాలకు రిబ్బన్ కట్ చేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. 

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు.. సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకపత్రాలు రెడీమేడ్ గా తయారై ఉన్నాయని వ్యాఖ్యానించారు. చనాకా –కొరాటా, సదర్మాట్ బ్యారేజీలను తామే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకున్నట్టే చరిత్రలో నిలబడుతుందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకొని, రూ.1200 కోట్లు ఖర్చు పెట్టి చనాకా-కొరాటా బ్యారేజీ, పంప్ హౌస్‌‌‌‌‌‌‌‌లు, మెయిన్ కెనాల్, సబ్ స్టేషన్లతో సహా పనులు పూర్తి చేయించారని గుర్తు చేశారు.  

ప్రాజెక్టుకు ఆయన పేరా?

లోయర్ పెన్ గంగా ప్రాజెక్టు పేరు చెప్పుకొని 2 సార్లు ఎన్నికల్లో గెలిచి, ప్రజల్ని మోసం చేసిన సి. రామచంద్రారెడ్డి పేరు.. ప్రాజెక్టుకు పెట్టడం అంటే ఆదిలాబాద్ ప్రజల మనోభావాలను అవమానించడమేనని హరీశ్‌‌‌‌‌‌‌‌రావు పేర్కొన్నారు.  ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ ప్రజల కలలు సాకారం చేసింది బీఆర్ఎస్ అయితే, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో వీసమెత్తు కృషి చేయని వ్యక్తి పేరు పెట్టి కాంగ్రెస్ మోసం చేస్తున్నదన్నారు.

ఎనుముల ఫ్యామిలీ అభివృద్ధి కోసమే అప్పులు

ఎనుముల ఫ్యామిలీ అభివృద్ది కోసం రెండేండ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని హరీశ్‌‌‌‌‌‌‌‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అప్పు అక్షరాల రూ.4.17లక్షల కోట్లే అని కాగ్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌తోపాటు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పినా ఎందుకు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అడిగారు. ప్రతిపక్షంలో అబద్ధాలే.. అధికార పక్షంలో అబద్ధాలే..  జీవితమంతా అబద్ధాలేనా? అని ప్రశ్నించారు. రెండేండ్లలో రేవంత్ రెడ్డి రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి, ఒక్క ఇటుక పెట్టలేదు..ఒక్క కాల్వ తీయలేదని విమర్శించారు.