ట్రూ అప్ భారం దించుమంటే.. తప్పించుకుంటరా? : హరీశ్రావు

ట్రూ అప్ భారం దించుమంటే.. తప్పించుకుంటరా? : హరీశ్రావు
  •     రూ. 5,420 కోట్ల విద్యుత్ బాదుడుపై ప్రశ్నిస్తే పారిపోయిండ్రు
  •     బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్​రావు

హైదరాబాద్, వెలుగు: విద్యుత్​ వినియోగదారులపై కాంగ్రెస్​సర్కారు మోపిన ‘ట్రూ అప్’​ చార్జీల భారం నుంచి తప్పించుకునేందుకు డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క కుంటిసాకులు వెతుక్కుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్​రావు మండిపడ్డారు. రూ. 5,420 కోట్ల భారాన్ని రద్దు చేసి పండుగ పూట ప్రజలకు శుభవార్త చెబుతారనుకుంటే, ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తామని అధికారులతో చెప్పించడం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఈమేరకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అసలు కరెంట్ కోతలే లేవని భట్టి విక్రమార్క బుకాయించడం విడ్డూరంగా ఉందన్నారు. సక్రమంగా విద్యుత్ అందిస్తుంటే రైతులు సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్ల ముట్టడికి ఎందుకు వస్తున్నారు? ఎందుకు ధర్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. 

నిందలేస్తే ప్రజల కష్టాలు తీరవ్

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు బొగ్గు కేటాయింపే లేదని డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి భట్టి అబద్ధాలు మాట్లాడారని హరీశ్‌‌‌‌‌‌‌‌రావు విమర్శించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ 2018 ఫిబ్రవరి 15న జారీ చేసిన ఆదేశాల ప్రకారం సింగరేణి గనుల నుంచి ఏటా 14 ఎంటీపీఏ (జీ-9 గ్రేడ్) బొగ్గును యాదాద్రికి కేటాయించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎల్ నినో సాకు చెబుతూ యాదాద్రిలో 3,000 మెగావాట్లు, భద్రాద్రిలో 540 మెగావాట్లు, కేటీపీఎస్‌‌‌‌‌‌‌‌లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడం పరిపాలనా వైఫల్యం కాక మరేమిటని నిలదీశారు.  మన రాష్ట్ర విద్యుత్ అవసరాలను గాలికొదిలేసి, సింగరేణి నిర్మిస్తున్న 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌‌‌‌‌‌‌‌ను రాజస్థాన్ కు ఇచ్చేందుకు స్వయంగా భట్టి విక్రమార్క ఒప్పందం చేసుకున్నారని, ఇది రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడం కాదా అని ప్రశ్నించారు.

ఎల్‌‌నినో లిక్కర్‌‌కు అడ్డు రాదా..?

లిక్కర్‌‌ ఉత్పత్తి, అమ్మకాలకు మాత్రం ఎల్‌‌నినో అడ్డురాదా? అని హరీశ్​రావు అన్నారు. రైతులకు కరెంట్‌‌, నీళ్లు ఇవ్వడానికి అయితే ఎల్‌‌నినో అడ్డొస్తదని.. మద్యం అమ్మకాలతో ఖజానా నింపుకోవడానికి అడ్డురాదా అని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం కంటే మద్యం ఆదాయంపైనే సర్కారుకు శ్రద్ధ ఉందా అని నిలదీశారు.