ఉపాధి పనులకు.. పోటెత్తుతున్రు..ఎల్ నినో ఎఫెక్ట్ తో తగ్గిన వ్యవసాయ పనులు

ఉపాధి పనులకు.. పోటెత్తుతున్రు..ఎల్ నినో ఎఫెక్ట్ తో తగ్గిన వ్యవసాయ పనులు
  • అక్టోబర్ లో ఆల్ టైం రికార్డు చేరిన కూలీల హాజరు
  • ఉపాధి పనులకు భారీ సంఖ్యలో హాజరవుతున్న కూలీలు
  • ఐదేండ్లలో ఎన్నడూ లేనంతగా రోజుకు సగటున 2.54 లక్షల మంది హాజరు 
  • గతేడాది అక్టోబర్​లో కేవలం 24,750 మందే.. 

హైదరాబాద్, వెలుగు : గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు (వీబీ జీ రామ్​జీ) కూలీలు పోటెత్తుతున్నారు. ఎల్​నినో కారణంగా వానలు పడకపోవడంతో వ్యవసాయ పనులు తగ్గిపోయాయి. దీంతో గ్రామీణ పేదలు, సన్నకారు రైతులు.. బతుకుదెరువు కోసం ఉపాధి ప‌‌‌‌‌‌‌‌నుల‌‌‌‌‌‌‌‌కు వెళ్తున్నారు. దీంతో ఆ పనులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. వర్షాభావ పరిస్థితులు తీవ్రం కావడంతో సెప్టెంబర్​ఆరంభం నుంచే ఉపాధి హాజరు గ్రాఫ్ భారీగా పెరుగుతూ అక్టోబర్​లో రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 

రికార్డు స్థాయిలో కూలీల హాజరు

కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పించడంతో పాటు వారికి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు చేపట్టిన ప్రత్యేక చర్యలు క్షేత్ర స్థాయిలో మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ప్రధానంగా భూగర్భజలాలు పెంచేందుకు చేపడుతున్న చర్యలతో కూలీల అవసరం ఏర్పడింది. ప్రతి పల్లెలో పొలం కుంటలు, నీటికుంటలు, జల వనరులను పెంచే పనులు చేపడుతుండడంతో కూలీల సంఖ్య పెరుగుతోంది.  

ఈ ఏడాది అక్టోబరు నెలలో ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరింది. మంగళవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 2,54,812 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. రాష్ట్రంలో 'వీబీ-జీ రామ్ జీ' అమల్లోకి వచ్చిన తర్వాత ఒకే రోజున ఇంత పెద్ద మొత్తం హాజరు నమోదు కావడం విశేషం. 

ఐదేండ్లుగా అక్టోబర్ నెలలో నమోదైన రోజువారీ సగటు కూలీల హాజరును పరిశీలిస్తే, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చొరవ ఏ స్థాయిలో పనిచేసిందో స్పష్టమవుతోంది. గతేడాది  అక్టోబర్‌‌లో రోజుకు సగటున కేవలం 24,750 మంది మాత్రమే పనులకు రాగా.., ఈ ఏడాది అక్టోబరులో రోజువారీ సగటు కూలీల సంఖ్య 2,16,000 కు చేరింది. ఉపాధి పనులకు డిమాండ్ పెరుగుతుండడంతో పనిదినాలను 150 రోజులకు పెంచాలని రాష్ట్ర సర్కారు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది.

ఎల్​నినో ఎఫెక్ట్ తో...

ఐదేండ్ల అక్టోబర్ సగటుతో పోలిస్తే ఈ సారి కూలీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు సరిగా పడక కరువు పరిస్థితులు తలెత్తాయి. సాధారణంగా అక్టోబర్ నాటికి వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతుంటాయి. ఈ సారి వర్షాభావం కారణంగా పనులు చాలా వరకు తగ్గిపోవడంతో వ్యవసాయ కూలీలు ప్రత్యామ్నాయంగా ఉపాధి పనుల వైపు మొగ్గు చూపుతున్నారు.

 దీనికి తోడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ప్రభుత్వం అలర్ట్ అయింది. వ్యవసాయ పనుల కొరతను ముందే గుర్తించి, ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టింది. అంతేకాకుండా, గతంలో జాబ్ కార్డులు పొందడానికి కూలీలు ఇబ్బందులు పడేవారు.

 ప్రస్తుతం నిబంధనల ప్రకారం కేవలం 15 రోజుల్లోనే జాబ్ కార్డులు ఇవ్వాలని గడువు విధించారు. దీనివల్ల కొత్తగా కార్డులు కోరుకునే నిరుపేదలకు వేగంగా జాబ్ కార్డులు అందుతున్నాయి. తద్వారా వారు తక్షణమే పనుల్లో చేరే అవకాశం లభించింది. గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి ఫీల్డ్ అసిస్టెంట్ల వరకు అందరూ స్వయంగా ఉపాధి పని ప్రదేశాలకు హాజరవుతున్నారు.

 కూలీలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం ద్వారా కూలీల్లో  ప్రభుత్వ విధానాలపై విశ్వాసం పెరిగింది. ఇది హాజరు శాతాన్ని మరింతగా పెంచేందుకు
 దోహదపడింది.

ఇందిరమ్మ ఇండ్ల అనుసంధానంతో...

కూలీల సంఖ్య పెరగడానికి  ఇందిరమ్మ ఇళ్ల స్కీం సైతం కారణమని పలువురు అంటున్నారు. ప్రతి ఇంటి నిర్మాణానికి ఉపాధి హామీ స్కీమ్​ను అనుసంధానిస్తూ 90 రోజుల పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి రోజువారీ కూలీ సుమారు రూ.300 చొప్పున దాదాపు రూ.27 వేలు ఇస్తుండంతో ఇంటి పునాదులు, మట్టి పనులు చేసుకునేందుకు రోజువారీ కూలీ గిట్టుబాటు అవుతుండడంతో లబ్ధిదారులు మస్టర్లలో పేర్లు నమోదు చేసుకుంటున్నారు.

 సొంత ఇంటి నిర్మాణంలో పనిచేసుకుంటూనే ఉపాధి హామీ కూలీ పొందుతున్నారు. కరువు ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం గ్రామాల్లో ఫారం పాండ్లు, పశువుల తొట్లు, కమ్యూనిటీ చేపల చెరువుల తవ్వకం పనులు ముమ్మరం చేసింది. నిధుల కేటాయింపు భారీగా ఉండడంతో పంచాయతీల్లో అధికారులు పనులు కల్పిస్తున్నారు. 

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు రైతుల పొలాల్లో పెద్ద ఎత్తున కుంటల తవ్వకాలు చేప‌‌‌‌‌‌‌‌ట్టారు.  నీటినిల్వతో పాటు అదనపు ఆదాయం కోసం పంచాయతీల పరిధిలో సామూహిక చేపల చెరువుల నిర్మాణాలు చేపట్టారు. ఫీడర్ ఛానల్స్, చెరువుల పూడికతీత పనుల్లో వందలాది మంది కూలీలు నిమగ్నమయ్యారు.