- 20 రాష్ట్రాల నుంచి తరలొచ్చిన 200కు పైగా స్టాళ్లు
- ఈ నెల18 వరకు కొనసాగనున్న మేళా
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్ పక్కన హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో బుధవారం సరస్ మేళా అట్టహాసంగా ప్రారంభమైంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సెర్ప్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ప్రారంభించారు. ఆకట్టుకునే హస్తకళలు, నోరూరించే తెలంగాణ సంప్రదాయ పిండివంటలు, తిరునల్వేలి హల్వా, ఈశాన్య రాష్ట్రాల మోమోలు.. వీటితో పాటు పేరిని నృత్యం, శివతాండవం, జానపదాల మధ్య మేళా కోలాహలంగా మొదలైంది.
ఈ మేళా 18వ తేదీ వరకు కొనసాగనున్నది. ఇందులో మొత్తం 200కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేయగా.. తెలంగాణ నుంచి 95, ఇతర రాష్ట్రాల నుంచి100కు పైగా స్టాళ్లు తరలొచ్చాయి. ఇవి కాకుండా వివిధ ప్రభుత్వ అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో మరో 43 స్టాళ్లు కొలువుదీరాయి.
మేళాలో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట అద్భుత చేనేత చీరలతో పాటు కొండపల్లి చెక్క బొమ్మలు, జూట్, లెదర్ బ్యాగులు, మట్టి పాత్రలు, బంజారా కళాకృతులు, ఎంబ్రాయిడరీ డిజైన్లు, ఆర్గానిక్ పచ్చళ్లు, మిల్లెట్ ఆహార ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
సరస్ మేళా గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యక్ష మార్కెట్ అనుభవాన్ని అందించే గొప్ప వేదికగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. మొదటిరోజు ప్రదర్శించిన శివతాండవం, పేరిని నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే 12న బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు.
