- డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, వెలుగు: దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఏటా సుమారు 1.75 లక్షల మంది, రాష్ట్రంలో సుమారు 7 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ మరణాల్లో తెలంగాణ దేశంలోనే ఏడో స్థానంలో ఉందన్నారు.
ఎలక్ట్రానిక్ డిటెయిల్డ్ యాక్సిడెంట్స్ రిపోర్ట్(ఈ–డీఏఆర్) గణాంకాల ఆధారంగా అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న100 జిల్లాలను కేంద్రం ప్రకటించిందని చెప్పారు. వీటిలో మన రాష్ట్రంలోని మేడ్చల్-–మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలు ఉన్నాయన్నారు. ఈ 7 జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 4 కమిషనరేట్ల సీపీలు, యూనిట్ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
230 ప్రాంతాల్లో 4 కంటే ఎక్కువ మరణాలు
ప్రమాదాల తీవ్రతను బట్టి 7 జిల్లాలను మొత్తం 48 క్రిటికల్ కారిడార్లుగా విభజించినట్లు డీజీపీ తెలిపారు. వీటిలో సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 14 క్రిటికల్ కారిడార్లు ఉన్నాయన్నారు. ఈ జిల్లాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ మరణాలు నమోదవుతున్న ప్రాంతాలు 230 ఉన్నాయని పేర్కొన్నారు. సేఫ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు రూపొందించిన ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ‘4ఈ’ విధానం( ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎమర్జెన్సీ సపోర్ట్) అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఈ- డార్ నమోదు చేయండి
రోడ్డు ప్రమాదాలు జరిగితే ఈ–-డార్ నమోదు చేయాలని రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి చెప్పారు. ప్రమాదాలు, గాయపడిన వారి వివరాలు, సంఘటన జరిగిన ప్రాంతం జియోట్యాగింగ్ఫొటోలను మార్గదర్శక్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలన్నారు. నవంబర్3న చెన్నైలో జరగనున్న సమావేశంలో సీఎస్, డీజీపీ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
