ఓటు హక్కు దుర్వినియోగానికి బీజేపీ కుట్ర.. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం

ఓటు హక్కు దుర్వినియోగానికి బీజేపీ కుట్ర..  ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం
  •     మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

మల్లాపూర్/కోరుట్ల, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును దుర్వినియోగం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తోందని, ఓటు చోరీపై ప్రశ్నించి నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. 

బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా నూతన అధ్యక్షుడు ఎంఏ నయిమ్ పదవీ బాధ్యతల స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నియామక పత్రాన్ని  అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఓటు చోరీ ఆరోపణలపై కేంద్రమంత్రులు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఇచ్చిన హామీలన్నీ వంద శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో దళిత స్పీకర్‌‌ను బీఆర్ఎస్ నేతలు అవమానించిన తీరుపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఆక్రమించిన వారి నుంచి భూములను తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. 

అనంతరం మెట్​పల్లిలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట  తెలంగాణ వెలమ కార్పొరేషన్​ చైర్మన్, కాంగ్రెస్​ కోరుట్ల నియోజకవర్గ ఇన్​ఛార్జి జువ్వాడి నర్సింగరావు, పార్టీ  రాష్ట్ర సీనియర్​ లీడర్​ జువ్వాడి కృష్ణారావు, జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేశ్, మైనార్టీ సెల్​ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్​ ఇర్ఫాన్​ ఆలీ ఉన్నారు. 

‘కోరుట్ల’ అభివృద్ధికి కృషి

కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామంలో ఎన్ హెచ్ఎం గ్రాంట్ కింద రూ.20లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను బుధవారం వెల్మ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మంత్రి ప్రారంభించారు.  

కాగా, గ్రామాల్లో నెలకొన్న రెవెన్యూ సరిహద్దు వివాదాలపై స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా,  వాటిని  పరిష్కరించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.  జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేశ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల అధ్యక్షులు నందయ్య, సోమయ్య పాల్గొన్నారు.