మిర్రర్ ఇమేజ్ అణువుల గుట్టువిప్పిన కగన్, కెన్సో సోయ్ లకు నోబెల్

మిర్రర్ ఇమేజ్ అణువుల గుట్టువిప్పిన కగన్, కెన్సో సోయ్ లకు నోబెల్
  • రసాయనశాస్త్రంలో మిర్రర్ ఇమేజ్ మాలిక్యూల్స్ మిస్టరీ
  • రెండూ ఒకే రూపంలో ఉన్నా ఒక్క అణువు వైపే జీవుల మొగ్గు
  • దీనిని ‘హోమోకైరాలిటీ’ గా వ్యవహరిస్తున్న సైంటిస్టులు
  • 2003లో మిర్రర్ ఇమేజ్ అణువుల్లో ఒకే అణువు ఉత్పత్తి చేసే చర్య ఆవిష్కరణ

స్టాక్​హోం: జీవులలోని మిర్రర్ ఇమేజ్ అణువుల వెనకున్న శతాబ్దాల రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు హెన్రీ బి. కగన్, కెన్సో సోయ్‌‌లను ఈ ఏడాది ప్రతిష్టాత్మక కెమిస్ట్రీ నోబెల్ వరించింది. కొన్ని అణురూపాల వైపే జీవులు ఎందుకు ఎక్కువగా మొగ్గు చూపుతాయనేదానిపై వారు చేసిన పరిశోధనలపై స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రశంసలు కురిపించింది. ప్రకృతిలో అద్దంలాంటి అణువుల నిర్మాణం, వాటి ఆకారం ఏవిధంగా స్వయంగా ఉద్భవిస్తాయనే సుదీర్ఘమైన అంశంపై వీరు చేసిన పరిశోధనలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయని పేర్కొంది. 

జపాన్‌‌కు చెందిన సైంటిస్ట్ కెన్సో సోయ్.. మిర్రర్ ఇమేజ్ మాలిక్యూల్స్‌‌లో ఒకే ఒక నిర్దిష్ట రూపం మాత్రమే ఆవిర్భవించేలా చేసే పద్ధతిని కనుగొన్నారు. ఫ్రాన్స్ కు చెందిన సైంటిస్ట్ హెన్రీ బి కగన్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ పారిస్‌‌లో పరిశోధనలు చేస్తున్నారు. ‘అసిమెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్’ రంగంలో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రసాయన శాస్త్రంలో వీరిద్దరి కృషికి గుర్తింపుగా ఈ ఏడాది కెమిస్ట్రీ నోబెల్ పురస్కారాన్ని ప్రకటించినట్లు స్వీడిష్ అకాడమీ పేర్కొంది. వీరి ఆవిష్కరణలు కేవలం సైద్ధాంతిక రసాయన శాస్త్రానికే కాకుండా, మెడిసిన్ తయారీకి ఉపయోగించే రసాయన చర్యలను రూపొందించడంలో అత్యంత కీలకంగా మారాయి.

ఏమిటీ మిర్రర్ ఇమేజ్ మాలిక్యూల్స్? 

కొన్ని అణువులు మనిషి ఎడమ, కుడి చేతుల మాదిరిగా.. ఒకేలా రెండు రెండు చొప్పున ఉంటాయి. వీటినే మిర్రర్ ఇమేజ్ మాలిక్యూల్స్ అంటారు. అమైనో ఆమ్లాలు ఇందుకు ఒక ఉదాహరణ. ఇవి ప్రోటీన్ల నిర్మాణానికి ఇటుకలలాంటివి. అయితే, జీవులు ఈ రెండింటిలో కేవలం ఒకే ఒక వెర్షన్‌‌ను మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తాయి. దీన్ని రసాయన శాస్త్రవేత్తలు “హోమోకైరాలిటీ” అని పిలుస్తారు. ఈ ప్రాధాన్యత ఎలా ఏర్పడుతుందనే దానిపై శాస్త్రవేత్తలు శతాబ్దానికి పైగా అన్వేషిస్తూనే ఉన్నారు. 

ఎందుకంటే అద్దంలోని ప్రతిబింబంలా ఉండే అణువులను తయారు చేయడానికి ప్రయత్నించినప్పుడు, వారి రసాయన చర్యలు సాధారణంగా రెండు వెర్షన్‌‌లను సమాన మొత్తంలో ఉత్పత్తి చేసేవి. ఈ దిశగా1986లో హెన్రీ కగన్ మొట్టమొదటగా సంచలనాన్ని సృష్టించారు. ఒక అద్ద ప్రతిబింబ రూపం మరొకదాని కంటే ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యేలా రసాయన చర్యలను నియంత్రించే మార్గాన్ని ఆయన కనుగొన్నారు. 

ఆ తర్వాత కెన్సో సోయ్ 1995లో కీలకమైన తదుపరి అడుగు వేసి, పూర్తిగా ఒకవైపు మాత్రమే ఉండే సామర్థ్యం ఉన్న రసాయన చర్యను వివరించారు. ఎనిమిది సంవత్సరాల తరువాత.. 2003లో, రెండు సాధ్యమైన మిర్రర్ ఇమేజ్‌‌లలో కేవలం ఆశించిన ఒక రూపం మాత్రమే ఉత్పత్తి అయ్యేలా చర్యను సృష్టించడంలో ఆయన విజయవంతమయ్యారు.