సింగరేణి ఓపెన్‍కాస్ట్తో ‘రామప్ప’కు ముప్పు.. వరుస పేలుళ్లతో దీర్ఘకాలంలో ఎఫెక్ట్

సింగరేణి ఓపెన్‍కాస్ట్తో ‘రామప్ప’కు ముప్పు..  వరుస పేలుళ్లతో దీర్ఘకాలంలో ఎఫెక్ట్
  •     యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప వారసత్వ సంపదను కాపాడాలి
  •     ఎన్‍ఐటీ రిటైర్డ్​ ప్రొఫెసర్‍ పాండురంగారావు 

వరంగల్‍, వెలుగు : ములుగు జిల్లా వెంకటపూర్‍లో ప్రతిపాదిత సింగరేణి ఓపెన్‍కాస్ట్​ మైనింగ్‍ తో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ఎన్‍ఐటీ రిటైర్డ్​ ప్రొఫెసర్‍ పాండురంగారావు తెలిపారు. బుధవారం కాకతీయ హెరిటెజ్‍ ట్రస్ట్ ప్రతినిధులు గ్రేటర్‍ వరంగల్‍ ప్రెస్‍క్లబ్‍లో ప్రెస్‍మీట్‍ నిర్వహించారు. 

ఈ సందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ సింగరేణి కాలరీస్‍ లిమిటెడ్‍ వెంకటపూర్‍ గ్రామంలో ప్రతిపాదించిన 300 మీటర్ల లోతైన ఓపెన్‍ కాస్ట్ గనుల తవ్వకాలతో భవిష్యత్​లో తప్పకుండా ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.  ఈ గని రామప్ప దేవాలయానికి దిగువ ప్రవాహ దిశలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. భౌగోళికంగా ఈ ప్రాంతం అస్థిరంగా ఉందని, ఉప భ్రంశాలు (ఫాల్ట్స్) పరస్పరం దాటుకుంటూ వెళ్లే జాయింట్లను కలిగి ఉందని చెప్పారు. 

ఈ ప్రాంతంలో శిల పొరలు వాలుదిశ (డిప్‍ డైరెక్షన్‍) ఈశాన్యం వైపు ఉండగా, అనేక జాయింట్లు, పగుళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవి 3 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన రామప్ప సరస్సు నీటి మట్టం..శిలా పొరల మధ్య నుంచి భూగర్భ జలాలు ప్రవహించడం ద్వారా ఓపెన్​  కాస్ట్​పై ప్రభావం చూపుతుందని జీఎస్​ఐ నివేదికలో పేర్కొందని వివరించారు.  రామప్ప దేవాలయ పునాది ఇసుక నిర్మాణం కావడం వల్ల నీటి ప్రవాలతో  నష్టం ఉంటుందని చెప్పారు. 

సింగరేణి సంస్థ రిపోర్ట్​ ప్రకారం రామప్ప దేవాలయంపై పేలుళ్ల ఎఫెక్ట్​ ప్రస్తుతానికి తక్కువగా కనిపిస్తున్నా దీర్ఘకాలంలో ప్రమాదముందన్నారు. భవిష్యత్​లో సునామీ వంటి విపత్తుకు కూడా దారి తీస్తుందన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ వారసత్వ సంపదను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.