వెలుగు స్పెషల్ : మహిళా వర్సిటీని  పాలమూరుకు తరలించాలి

వెలుగు స్పెషల్ :  మహిళా వర్సిటీని  పాలమూరుకు తరలించాలి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షల్లో  నీళ్లు, నిధులు, నియామకాలతోపాటు విద్య వంటి మౌలిక సదుపాయాల అంశం కూడా ప్రధానమైన వాటిలో ఒకటి.  తెలంగాణ  ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఏ విధంగా నష్టపోయిందో  ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత నాయకులు, మేధావులు, విద్యావంతులు గణాంకాలతో సహా వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో తెలంగాణ విద్యా సౌకర్యాల విషయంలో ఎంతగా నష్టపోయిందో  అంతకు రెండింతలు నష్టపోయి ఉమ్మడి పాలమూరు జిల్లా  వెనుకబాటుతనానికి గురైంది. 

అక్షరాస్యతలో పాత పది జిల్లాల ప్రకారం చూసినా చివరినుంచి మొదటగా కనిపించేది పాలమూరే!.  లేదా  ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల వారీగా చూసిన ఆఖరి నుంచి చివరగా ఉండేవి  గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూలు వంటి జిల్లాలన్నీ కూడా వరుసగా ఉమ్మడి  పాలమూరువే కావడం గమనార్హం.

తెలంగాణ సగటు అక్షరాస్యత 66.5 శాతం

దీనికి సాక్ష్యమే ఈ గణాంకాలు. తెలంగాణ రాష్ట్ర సగటు అక్షరాస్యత 2011 జనాభా లెక్కల ప్రకారం 66.5%గా ఉంది.  అలాగే  పాలమూరు అక్షరాస్యత 55.04%గా ఉంది. అదే సమయంలో భారతదేశ సగటు అక్షరాస్యత 72.98% గా ఉంది.  అంటే  తెలంగాణ దేశ సగటు అక్షరాస్యతకు ఒక్క అడుగు దూరంలో అనుకుంటే, పాలమూరు దేశ అక్షరాస్యతకు మూడు అడుగుల వెనుకబాటును సూచిస్తోంది.   అదే సమయంలో పాలమూరు అక్షరాస్యత రేటు  దేశంలోనే అత్యంత తక్కువ అక్షరాస్యత రేటు ఉన్న బిహార్, జార్ఖండ్  రాష్ట్రాల సగటు కంటే కూడా వెనుకబడింది.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాలమూరు వెనుకబాటుతనాన్నే తెలంగాణ వెనుకబాటుగా చూపించిన నాటి ఉద్యమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పాలమూరు ప్రాంత అక్షరాస్యతను పెంచేందుకు  ప్రయత్నించలేదు.  ఈ ప్రాంతంలో  విద్యావకాశాలు మెరుగుపరిచేందుకు  ప్రత్యేక దృష్టితో  లేదా బడ్జెట్ కేటాయింపుల పెంపు వంటివి  ఏమీ చేయలేదు.

ఉమ్మడి పాలమూరు జిల్లా మహిళా అక్షరాస్యత రేటు 44.72%  

ఈ దేశ  మహిళా అక్షరాస్యత 2011 జనాభా లెక్కల ప్రకారం 64.64%.  అదే  జనాభా  లెక్కల  ప్రకారం... తెలంగాణ  మహిళల అక్షరాస్యత రేటు 57.92%,  బిహార్  మహిళా అక్షరాస్యత రేటు  51.5%,  అదే సమయంలో అదే 2011  లెక్కల ప్రకారం  ఉమ్మడి  పాలమూరు జిల్లా మహిళా అక్షరాస్యత రేటు 44.72%.  అంటే  ఈ దేశ, 
ఈ రాష్ట్ర  సగటు  అక్షరాస్యతనే గాదు,  దేశంలోనే అక్షరాస్యతలో  అత్యంత  వెనుకబడిందని  భావించే  బిహార్  రాష్ట్ర  మహిళల కంటే,  పాలమూరు ప్రాంత మహిళలు అక్షరాస్యతలో  ఎంత వెనకబడ్డారో ఈ గణాంకాలను ఒకసారి అధ్యయనం చేస్తే అవగతమవుతుంది. ఈ అంశాల ఆధారంగా స్పష్టమవుతున్నది ఒక్కటే.. పాలమూరు అక్షరాస్యతలో అందులో మరీ ముఖ్యంగా మహిళల అక్షరాస్యతలో ఈ దేశంలోనే అత్యంత వెనుకబడి ఉందన్న విషయం  తేటతెల్లమవుతుంది.  మహిళా విశ్వవిద్యాలయం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వ అధినేత ఒకటి, రెండు సందర్భాల్లో మాట్లాడినప్పటికీ అది నీటిమూటగానే మిగిలిపోయింది.  కాబట్టి సాధించిన స్వరాష్ట్రంలోనైనా పాలమూరు ఆశలు ఆకాంక్షలు నెరవేరాలని అందులో భాగంగానే మహిళా విశ్వవిద్యాలయాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏర్పాటుచేయాలి. మహిళలకు ఉన్నత విద్యను అందుబాటులో, చేరువలోకి తేవడం ద్వారా వారికి  ప్రోత్సాహకంగా ఉండి బాలికల అక్షరాస్యత పెంపుదలకు,  మహిళల ఉన్నతికి దోహదపడాలి.
 

మహిళా విద్యాభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి

మహిళా అక్షరాస్యత ఆవశ్యకతను ప్రస్తుత ప్రభుత్వ పెద్దలైనా గ్రహించాలని  కోరుతున్నాం.  అదే సమయంలో అప్పటికే డిగ్రీ, పీజీ కోర్సులతో మహిళా కళాశాలగా కొనసాగుతున్న హైదరాబాద్‌లోని కోఠీ ఉమెన్స్ కాలేజీని ఉన్నపళంగా విశ్వవిద్యాలయంగా పేరు మార్చినంత మాత్రాన  కొత్తగా బాలికలకు అందుబాటులోకి  వచ్చింది ఏమీ లేదు.  ఒక విశ్వవిద్యాలయం రూపుదిద్దుకున్నది అంటే దాని ద్వారా నూతనంగా అనేక కొత్త అవకాశాలు పెరగాలి. కానీ ఇక్కడ ఉన్న కళాశాలనే విశ్వవిద్యాలయంగా ప్రకటించడం చేత కొత్తగా బాలికలకు అవకాశాలు ఏమీ పెరగలేదు. కాబట్టి కోఠీ ఉమెన్స్ కళాశాలను ఉన్నది ఉన్నట్లుగానే యథాతథంగా ఉంచి, ఉమ్మడి పాలమూరు కేంద్రంగా నూతనంగా అదే వీరనారి చాకలి ఐలమ్మ పేరుతో మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు  చెయ్యాలి,  లేదా  ఇప్పుడున్న మహిళా యూనివర్సిటీని అయినా పాత పాలమూరు జిల్లాకు తరలించాలని పాలమూరు జిల్లా విద్యార్థినులు, మహిళలు, ప్రజల డిమాండ్. ప్రజల అవసరాన్ని, ఆవశ్యకతను గుర్తించి ప్రభుత్వమే బాధ్యతగా ఏర్పాటుచెయ్యాలి.  

-  కడారి రమేష్ యాదవ్
ఉస్మానియా యూనివర్సిటీ 
విద్యార్థి జేఏసీ చైర్మన్