ఢిల్లీలో కుప్పకూలిన మరో బిల్డింగ్.. ముగ్గురు మృతి, 8 మంది రెస్క్యూ..

ఢిల్లీలో కుప్పకూలిన మరో బిల్డింగ్.. ముగ్గురు మృతి, 8 మంది రెస్క్యూ..
  • శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం గాలింపు
  • నెల రోజుల్లో ఇది రెండో ఘటన 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ మరణించగా, పలువురు గాయపడ్డారు. భవనం కూలిన ధాటికి పక్కనే ఉన్న మరో రెండు, మూడు ఇళ్ల భాగాలు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పటికే ఎనిమిది మందిని రక్షించి ఆసుపత్రులకు తరలించామని షాదరా డీసీపీ రాజేంద్ర ప్రసాద్ మీనా చెప్పారు. లోపల చిక్కుకున్న బాధితులు మాట్లాడుతున్నారని, వారిని బయటకి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. 

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు. తమ చేతులతోనే ఇటుకలు, రాళ్లను తొలగిస్తూ శిథిలాల కింద ఉన్నవారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఒక వీడియోలో స్థానికులు ఒక మహిళను శిథిలాల నుంచి బయటకు లాగి మోసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఘటన స్థలంలో క్షతగాత్రులకు సాయం అందించేందుకు పారామెడిక్స్, అత్యవసర వైద్య సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. భారీ జేసీబీ యంత్రాలను ఉపయోగించి పెద్ద ఎత్తున పడి ఉన్న శిథిలాలను తొలగిస్తున్నారు.

భూకంపమే కారణమా?

మంగళవారం రాత్రి ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లో సంభవించిన భూకంపం కారణంగా ఢిల్లీ-ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్ పరిధిలో ప్రకంపనలు రావడంతో ఈ భవనానికి పగుళ్లు ఏర్పడినట్లు స్థానికులు చెప్పారు. అయితే, భవనం కూలడానికి అసలు కారణం ఏమిటనేది పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు తెలిపారు. 

సరిగ్గా నెల రోజుల క్రితం ఢిల్లీలోని సత్యనికేతన్‌‌‌‌‌‌‌‌లో ఒక భవనం కూలిపోయి ఏడుగురు మృతి చెందగా, 12 మంది గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా సీమాపురిలో జరిగిన ఈ ప్రమాదంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.