వెలుగు స్పెషల్ : పాదరసంతో ప్రజారోగ్యానికి ముప్పు 

వెలుగు స్పెషల్ : పాదరసంతో ప్రజారోగ్యానికి ముప్పు 

మన చుట్టూ ఉన్న పలు పరికరాల్లో ఉండే పాదరసం (మెర్క్యురీ) పెద్దగా ప్రమాదకరం కాదనే భావన మనకు ఉంటుంది.  థర్మామీటర్ పగిలిపోయినా అందులోని మెర్క్యురీ బిందువులను చేతులతో తీసి చెత్తబుట్టలో పడేయడం చాలాచోట్ల ఇప్పటికీ కనిపించే సాధారణ దృశ్యం.  కానీ పర్యావరణంలోకి చేరిన తర్వాత పాదరసం రూపం మార్చుకుని గాలి, నీరు, నేల ద్వారా విస్తరించే అవకాశం ఉండటంతో.. దీని ప్రభావం అంత తేలికగా తీసుకునే విషయం కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మైనింగ్ ప్రాంతాల్లో భూమి పొరల నుంచి వెలువడే పాదరసం, పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పాత పరికరాలు, మెర్క్యురీ కలిగిన దీపాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, డంపింగ్ యార్డుల నుంచి వెలువడే కాలుష్యం కూడా పర్యావరణంలోకి చేరే అవకాశం ఉంది. 

డంపింగ్ యార్డులు, వ్యర్థాల ప్రాంతాల నుంచి బయటకు వెదజల్లే పాదరసం స్థాయిని నిరంతరం కొలిచే పర్యవేక్షణ వ్యవస్థలు అనేక ప్రాంతాల్లో పరిమితంగా ఉండటం కూడా ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు భావిస్తున్నారు.  మైనింగ్ సమయంలో భూమి పొరల్లోని పాదరసం వాతావరణంలోకి చేరితే.. గాలి ద్వారా వ్యాపించి, వర్షాలతో చెరువులు, నదులు, ఇతర జలవనరుల్లోకి చేరే అవకాశం ఉంది. చేపలు, ఇతర  జలచరాలను తినడం ద్వారా మనుషుల శరీరంలోకి  చేరే  ప్రమాదం ఉంది.

జపాన్‌‌‌‌‌‌‌‌లో మినమాటా విషాదం

పాదరసం కాలుష్యం వల్ల కలిగే ప్రమాదాలకు ప్రపంచానికి తెలిసిన అతిపెద్ద ఉదాహరణ జపాన్‌‌‌‌‌‌‌‌లోని మినమాటా విషాదం. పారిశ్రామిక కాలుష్యం ద్వారా సముద్రంలోకి చేరిన మెర్క్యురీ..  చేపలు, ఇతర జలచరాల్లో పేరుకుపోయి.. వాటిని ఆహారంగా తీసుకున్న ప్రజల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసింది. ముఖ్యంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా పాదరసం కాలుష్యంపై ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలోనే పాదరసం కాలుష్యాన్ని నియంత్రించేందుకు అంతర్జాతీయంగా ‘మినమాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యురీ’ ఏర్పడింది. పాదరసం కాలుష్యాన్ని తగ్గించడం, దాని వల్ల ప్రజలకు, పర్యావరణానికి కలిగే నష్టాలను నియంత్రించడం ఈ అంతర్జాతీయ ఒప్పందం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.  

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వేదికగా..పాదరస కాలుష్యంపై ప్రపంచ సదస్సు

పాదరస  కాలుష్యంపై  ప్రపంచవ్యాప్తంగా చర్చించేందుకు ఇప్పుడు భారత్ వేదికగా మారింది.  భారత్‌‌‌‌‌‌‌‌లో తొలిసారిగా ఐఐటీ హైదరాబాద్ వేదికగా ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మెర్క్యురీ యాజ్ ఎ గ్లోబల్ పొల్యూటెంట్–ICMGP 2026’ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది.  అక్టోబర్ 4 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు  ప్రపంచంలోని  వివిధ దేశాల నుంచి పాదరసం కాలుష్యంపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, పర్యావరణ  నిపుణులు, ప్రజారోగ్య నిపుణులు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు, పరిశ్రమల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల నిపుణులు పాల్గొంటున్నారు.  పాదరసం  గాలి, నీరు, నేలలోకి ఎలా చేరుతోంది?  జలవనరుల్లోకి  చేరిన తర్వాత ఏం జరుగుతోంది? చేపలు, ఇతర జలచరాల్లో అది ఎలా పేరుకుపోతోంది? ఆహారం ద్వారా మనుషుల్లోకి చేరినప్పుడు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? కాలుష్యాన్ని ముందుగానే ఎలా గుర్తించాలి? దాన్ని ఎలా నియంత్రించాలి? అనే అంశాలపై సదస్సులో చర్చిస్తున్నారు.  కాలుష్యాన్ని తగ్గించే సాంకేతిక పరిజ్ఞానాలు, ప్రజారోగ్యాన్ని రక్షించే విధానాలపై ఈ సదస్సులో పరిశోధకులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. పాదరసం కాలుష్యాన్ని ఎంత త్వరగా గుర్తించి నియంత్రిస్తే అంత మంచిదనే అంశంపై ప్రపంచ నిపుణులు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారు.

పాదరసం ప్రభావంపైప్రజలలో అవగాహన కల్పించాలి

పాదరసం కాలుష్యాన్ని గుర్తించేందుకు, నీరు, నేల, ఇతర పర్యావరణ నమూనాల్లో పాదరసం స్థాయిని కొలవడం కోసం ప్రత్యేక పరికరాలు అవసరం. అధునాతన పరికరాలు మాత్రమే పాదరస కాలుష్యాన్ని పసిగడతాయి. ఈ నేపథ్యంలో ఐఐటీ హైద రాబాద్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న సదస్సు ప్రాంగణంలో పలు కంపెనీలు పాదరసం కాలుష్యాన్ని గుర్తించే ఆధునిక పరికరాలను ప్రదర్శిస్తున్నాయి. వాతావరణం, నీరు, ఇతర నమూనాల్లో మెర్క్యురీ స్థాయిని గుర్తించేందుకు తమ పరికరాలు ఉపయోగపడతాయని కంపెనీ ప్రతినిధులు వివరిస్తున్నారు. పాదరసం మనిషి శరీరంలోకి ఎంతమేరకు చేరిందో అంచనా వేసేందుకు కూడా కొత్త పద్ధతులపై నిపుణులు దృష్టి సారిస్తున్నారు. జపాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ సంస్థ ప్రతినిధులు వెంట్రుకల నమూనాలను సేకరించి, వాటిలోని పాదరసం స్థాయిని పరీక్షించే విధానాన్ని సదస్సులో ప్రదర్శిస్తున్నారు.  నిరంతర పర్యవేక్షణ,  ప్రజలకు అవగాహన, ప్రమాదకర వ్యర్థాల సురక్షిత నిర్వహణ, శాస్త్రీయ పరిశోధన, కట్టుదిట్టమైన 
నియంత్రణ చర్యలు ఉంటేనే పాదరసం కాలుష్యాన్ని సమర్థంగా అడ్డుకోగలం.  పాదరసం ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనాలు, నిర్ధారణ పరీక్షలు ప్రజల ఆరోగ్య రక్షణకు అత్యంత కీలకం. 


 
- జె. శ్రీధర్ గౌడ్
జర్నలిస్ట్