- అక్రమ అరెస్టులకు నిరసనగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ధర్నా
హుస్నాబాద్/చిగురుమామిడి(కరీంనగర్), వెలుగు: ఎన్నికల సంఘం బీజేపీకి పూర్తి ఏజెంట్‌లా మారి ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అక్రమ అరెస్టులకు నిరసనగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట బుధవారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మంత్రి ధర్నా నిర్వహించారు.
‘సీఈసీ వెంటనే రిజైన్ చేయాలి’ అంటూ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ జాబితా సవరణ పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లను అక్రమంగా గల్లంతు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇస్తున్న ఆదేశాల ప్రకారమే ఈసీ నడుచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అక్రమాలకు నిరసనగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు 'ఇండియా' కూటమి ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ప్రశ్నించే గొంతులను అరెస్టులు, అణచివేతలతో భయపెట్టలేరని, ఇది ముమ్మాటికీ నియంతృత్వ పాలనేనని ధ్వజమెత్తారు.
‘ఓటు బచావో.. - దేశ్ బచావో’ అనేది ప్రతి ఒక్క పౌరుడి హక్కుల పోరాటమని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు జాబితాలో ఉందో లేదో ఇంటింటికీ వెళ్లి సరిచూసుకోవాలని పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఎఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామనిమంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం, రామంచ, చిన్నముల్కనూరు, పీచుపల్లి, సీతారాంపూర్ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.
పీచుపల్లి గ్రామాన్ని సోలార్‌లో మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలని, ప్రతి ఇంటి ముందు సోలార్ కనిపించేలా చేయాలని సూచించారు. రూ.2 లక్షలతో సోలార్ ఏర్పాటు చేసుకుంటే రూ.78 వేల వరకు సబ్సిడీ, మిగతా మొత్తానికి బ్యాంకు రుణం అందే అవకాశం ఉందని తెలిపారు. ముదిమాణిక్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. రామంచలో మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.40 లక్షల రుణాల చెక్కులను పంపిణీ చేశారు.
చిన్నముల్కనూరులో మాట్లాడుతూ రోడ్డు వైండింగ్‌లో ఇండ్లు కోల్పోయిన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ అనుమతులతో స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చిత్రా మిశ్రా, ఆర్డీవో షర్మిల, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వడ్డెర కార్పొరేషన్ వైస్ చైర్మన్ బత్తుల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
