ఆస్తులు ప్రకటించకుంటే  ఓటరు నిర్ణయం మారుతుందా? సీఎం విజయ్ కేసులో పిటిషనర్ కు మద్రాస్ హైకోర్టు ప్రశ్న..

ఆస్తులు ప్రకటించకుంటే  ఓటరు నిర్ణయం మారుతుందా? సీఎం విజయ్ కేసులో పిటిషనర్ కు మద్రాస్ హైకోర్టు ప్రశ్న..
  • 600 కోట్లలో 30 కోట్ల ఆస్తులు చూపకపోతే అవినీతి అనవచ్చా?

చెనై: ఎన్నికల అఫిడవిట్‌‌‌‌‌‌‌‌లో రూ. 600 కోట్ల విలువైన ఆస్తులను వెల్లడించిన తమిళనాడు సీఎం విజయ్.. కేవలం రూ. 30 కోట్ల ఆస్తుల వివరాలను చూపించకపోవడం ‘అవినీతి’ కిందకు వస్తుందా? అని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ్ గెలుపును సవాలు చేస్తూ ఎస్ దినేశ్ అనే ఓటరు పిటిషన్​ దాఖలు చేశారు. విజయ్ తన ఎన్నికల అఫిడవిట్‌‌‌‌‌‌‌‌లో ఆర్థిక వివరాలను సరిగ్గా వెల్లడించలేదని, వ్యత్యాసాలు ఉన్నాయని పిటిషనర్ ఆరోపించారు. ఆ ఎన్నికల పిటిషన్‌‌‌‌‌‌‌‌ను కొట్టివేయాలని కోరుతూ విజయ్ దాఖలు చేసిన అప్లికేషన్‌‌‌‌‌‌‌‌పై జస్టిస్ వి లక్ష్మీనారాయణన్ విచారణ చేపట్టారు. 

ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ‘విజయ్ ప్రముఖ సినీ నటుడు. ఆయన పేరిట అనేక ఆస్తులు ఉంటాయి. నేను న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు నా ఆస్తుల జాబితాను నేనే స్వయంగా కూర్చుని తయారు చేయలేదు. నా సీఏపై ఆధారపడ్డాను. అలాగే, విజయ్ కూడా తన సీఏపైనే ఆధారపడి ఉంటారు. 

ఒకవేళ సీఏ ఏవైనా ఆస్తుల వివరాలను విస్మరిస్తే, దాని ఆధారంగా ఎన్నికను రద్దు చేయవచ్చా? రూ. 600 కోట్ల ఆస్తులు ప్రకటించిన వ్యక్తి, మరో 30 కోట్ల ఆస్తుల వివరాలు తెలపకుంటే, విజయ్‌‌‌‌‌‌‌‌కి ఓటు వేయాలని అప్పటికే నిర్ణయించుకున్న ఓటరు తన అభిప్రాయాన్ని మార్చుకుంటారా?’ అని ప్రశ్నించారు. విజయ్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణన్ వాదిస్తూ.. ఎన్నికల అఫిడవిట్‌‌‌‌‌‌‌‌లో చిన్న చిన్న తేడాలు లేదా పొరపాట్లు ఉన్నంత మాత్రాన ఎన్నికను రద్దు చేయలేరని పేర్కొన్నారు.