‘సర్’ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉంది..ఓటు హక్కు కాలరాయడం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే

‘సర్’ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉంది..ఓటు హక్కు కాలరాయడం..  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే
  • రాహుల్‌‌గాంధీ ధర్నాను అడ్డుకోవడం దుర్మార్గం  : మంత్రి వాకిటి శ్రీహరి 

మక్తల్, వెలుగు :  ఓటర్ల జాబితా సవరణ సర్వే ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లను అధికంగా తొలగిస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోందని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్‌‌లోని క్యాంపు కార్యాలయంలో  ప్రెస్​మీట్​నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ప్రతి పౌరుడికీ జీవించే హక్కు ఎంత ముఖ్యమో ఓటు హక్కు కూడా అంతే ముఖ్యమని, ఓటు హక్కు కాలరాయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌‌గాంధీని అరెస్ట్ చేయడం దుర్మార్గమని విమర్శించారు.

 చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.మక్తల్ నియోజకవర్గంలో 70 వేల ఓట్లు తొలగించారని ఆరోపించారు.  రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటు హక్కు పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.

 ఇరిగేషన్ భవనానికి భూమిపూజ

మక్తల్ పట్టణంలో ఇరిగేషన్​ భవన నిర్మాణానికి రూ.4 కోట్లతో కలెక్టర్ ప్రియాంకతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజ చేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కార్యాలయాలు, సిబ్బంది విధుల నిర్వహణకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్​పర్సన్ మానస, ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్​నాయకులు పాల్గొన్నారు.