కోల్బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థ లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు 10శాతం వాటా ఇప్పించాలని కోరుతూ రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్వెంకటస్వామికి ఆ సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో పర్యటించిన మంత్రిని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ 2025-–26 సంవత్సరానికి సంబంధించిన సింగరేణి లాభాలను నేటి వరకు ప్రకటించలేదన్నారు.
సింగరేణి సంస్థలో పర్మినెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, కానీ సింగరేణి యాజమాన్యం కేవలం పర్మినెంట్ కార్మికులకు మాత్రమే పెద్ద మొత్తంలో లాభాల వాటాను కేటాయిస్తోందని తెలిపారు. సింగరేణికి వచ్చే లాభాలలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ ఎంతో ఉన్నప్పటికీ వారికి యాజమాన్యం అతి తక్కువ వేతనాలు చెల్లిస్తోందని తెలిపారు.
ఈ క్రమంలో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా 10శాతం లాభాల వాటా కేటాయించేలా సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించాలని మంత్రిని కోరారు. మంత్రిని కలిసినవారిలో యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డి.బ్రహ్మనందం, ప్రధాన కార్యదర్శి ఏ. వెంకన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టి. శ్రీనివాస్, బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షులు, రీజియన్ నాయకులు రాయలింగు భూమయ్య, కనకయ్య, గణేశ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
