వెలుగు స్పెషల్ : ఆర్ఎంపీలకు శిక్షణ, గుర్తింపు ఇంకెప్పుడు? 

వెలుగు స్పెషల్ :  ఆర్ఎంపీలకు శిక్షణ, గుర్తింపు ఇంకెప్పుడు? 

ఆధునిక వైద్య సాంకేతికత ఎంత ఎత్తుకు ఎదిగినా, పట్టణాలలో రూపుదిద్దుకున్న అత్యాధునిక కార్పొరేట్ ఆసుపత్రులు ఎంతగా మెరిసిపోతున్నా.. నేటికీ మన దేశపు ఆత్మ అయిన గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజల ప్రాణాలకు నిజమైన రక్షణ కవచంగా నిలుస్తున్నది ఆర్‌‌ఎంపీ, పీఎంపీ  వైద్యులే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అరకొర వసతులతో మూలుగుతుండటం, ప్రభుత్వ వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తుండటం, అత్యవసర సమయాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడం నిత్యకృత్యంగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పల్లె ప్రజలకు ఏ చిన్న లేదా పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా మొదటి దిక్కు, కొండంత అండ ఆర్‌‌ఎంపీ వైద్యులే. అయితే, అహర్నిశలు శ్రమిస్తూ పల్లె ప్రజల ప్రాణాలు కాపాడుతున్న ఈ గ్రామీణ వైద్యుల సేవలను అభినందించాల్సిందిపోయి, ప్రభుత్వం, డీఎంహెచ్‌‌ఓ, అధికారులు, ఐఎంఏ  వర్గాలు కక్షగట్టినట్లు  ప్రవర్తిస్తూ, వారిని నేరస్థులుగా చిత్రీకరిస్తూ దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం తీవ్రంగా ఖండించదగిన తీవ్రమైన అంశం.

గ్రామీణ వైద్యుల సేవలను గుర్తించి, వారికి తగిన శిక్షణనిచ్చి అధికారికంగా ప్రాథమిక వైద్యానికి గుర్తింపు కల్పిస్తామని గతంలోనే ప్రభుత్వం స్పష్టమైన జీవో (జీఓ.నం 1273/429) జారీ చేసింది. కానీ ఆ జీవోను కార్యరూపంలోకి తేకుండా ఏళ్ల తరబడి నాన్చడం పాలకుల అలసత్వానికి, నిర్లక్ష్యానికి నిదర్శనం. సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకుండా, తనిఖీల పేరుతో దాడులు చేయించడం, కేసులు నమోదు చేయించి వేధింపులకు గురిచేయడం ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రం తగదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఆరోగ్య శాఖ ఇప్పటికైనా తన తీరును మార్చు కోవాలి.   ప్రభుత్వం ఆధ్వర్యంలో తక్షణమే ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి, వారిని ప్రాథమిక చికిత్స అందించే అధికారిక గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలుగా గుర్తించాలి. 

 - వెంకగారి భూమయ్య