27లోగా ఓయూ తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయండి..లేకుంటే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే: హైకోర్టు

27లోగా ఓయూ తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయండి..లేకుంటే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను ఈ నెల 27లోగా రెగ్యులరైజ్​ చేయాలని.. లేకుంటే అధికారులు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.  


31 మంది ఉద్యోగులు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చలపతిరావు బుధవారం విచారణ చేపట్టారు. కోర్టు ఆదేశాల మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విచారణకు హాజరయ్యారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ ఆమోదానికి పంపామని, వివిధ అభ్యంతరాలతో ఫైలు వెనక్కి వస్తోందని ఆమె కోర్టుకు తెలిపారు. 

ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుని ఆదేశాలను అమలు చేస్తుందని ఆమె చెప్పగా.. ఇంకా ఎంతకాలం జాప్యం చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఉద్యోగులు ఇబ్బందులు పడుతూనే ఉండాలా అని వ్యాఖ్యానించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను తిరస్కరించే అధికారం అధికారులకు లేదని స్పష్టం చేశారు.

 తమ ఆదేశాల అమలుకు మరో అవకాశం ఇస్తున్నామని, ఈ నెల 27లోగా అమలు చేయాలని స్పష్టం చేశారు. లేకుంటే అధికారులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని, హాజరు మినహాయింపుతోపాటు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాజరుకు కూడా అనుమతించబోమని పేర్కొంటూ విచారణను కోర్టు వాయిదా వేసింది.