తప్పు మీరు చేసి  మాపై నిందలా? హరీశ్ చెబుతున్నవన్నీ అబద్ధాలే: భట్టి

తప్పు మీరు చేసి  మాపై నిందలా?  హరీశ్ చెబుతున్నవన్నీ అబద్ధాలే: భట్టి
  • బొగ్గు కేటాయింపులు లేకుండానే యాదాద్రి థర్మల్ ప్లాంట్ కట్టిన్రు
  • అక్కడ కరెంటు ఉత్పత్తి ఖర్చు దేశంలోనే ఎక్కువగా యూనిట్​కు రూ. 6.66
  • పూర్తి ఆధారాలతో వివరించిన డిప్యూటీ సీఎం
  • విద్యుత్​ డిమాండ్​ 20 వేల మెగావాట్లకు చేరినా కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని వెల్లడి 

 

హైదరాబాద్, వెలుగు:మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  కొట్టి పారేశారు. ‘మీరు తప్పులు చేసి మాపై నిందలేస్తారా?’ అంటూ హరీశ్ రావుపై  మండిపడ్డారు.   విద్యుత్​ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌‌‌‌లు), ట్రాన్స్‌‌‌‌కో, జెన్‌‌‌‌కోలను ప్రైవేటీకరించబోతున్నారని, లిస్టెడ్‌‌‌‌ కంపెనీలుగా మార్చబోతున్నారంటూ చేస్తున్న  ప్రచారాన్ని ఖండించారు.  అలాంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. 
 

బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ప్రజా భవన్‌‌‌‌‌‌‌‌లో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం పబ్లిక్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌ టేకింగ్స్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా విశ్వసిస్తుందని చెప్పారు. నెహ్రూవియన్‌‌‌‌‌‌‌‌ ఆర్థిక విధానం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, బలమైన ప్రభుత్వ రంగ సంస్థలే తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. విద్యుత్​రంగంపై కొందరు ప్రతిపక్ష పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షం తీరుతో రాష్ట్రానికి నష్టం జరుగుతున్నదన్నారు. యాదాద్రి ప్లాంట్​నిర్మాణంలో గత ప్రభుత్వం చేసిన తప్పులపై డాక్యుమెంటరీ ఆధారాలతో భట్టి క్లారిటీ ఇచ్చారు.  

రాజకీయ విమర్శలు వద్దు..

రాష్ట్ర విద్యుత్‌‌‌‌‌‌‌‌ రంగం, యాదాద్రి థర్మల్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌పై హరీశ్‌‌‌‌‌‌‌‌రావు చేస్తున్న విమర్శలకు  భట్టి విక్రమార్క కౌంటర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. పదేండ్లు అధికారంలో ఉన్న వారు తాము చేసిన తప్పిదాలను చెప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నామనే కారణంతో తమ ప్రభుత్వంపై ఇష్టానుసారం రాజకీయ విమర్శలు చేయడం  సరికాదని అన్నారు. యాదాద్రి పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన బొగ్గు కేటాయింపులు, సరఫరా లింకేజీలను ముందుగానే నిర్ధారించకుండా ప్లాంట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. థర్మల్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి స్థలం, డీపీఆర్‌‌‌‌‌‌‌‌, సాంకేతిక అంశాలతోపాటు బొగ్గు లింకేజీ అత్యంత కీలకమని చెప్పారు. ‘‘అవసరమైన బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత పరిమాణంలో వస్తుంది? దాని నాణ్యత ఏమిటి? సరఫరా సామర్థ్యం ఎంత?’’ అనే అంశాలపై స్పష్టమైన ప్రణాళిక లేకుండా యాదాద్రి ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను నిర్మించారని విమర్శించారు.

బొగ్గు లేకుండా ప్లాంట్​ పెట్టిన్రు.. 

నది లేకుండా డ్యామ్​ కట్టినట్టుగా గత ప్రభుత్వం బొగ్గు లేకుండా యాదాద్రి థర్మల్​ ప్లాంట్​ నిర్మించిందని భట్టి ఎద్దేవా చేశారు. గత పాలకుల హయాంలో యాదాద్రి పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి  2015 ఫిబ్రవరి 16న లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇంటెంట్‌‌‌‌‌‌‌‌ (ఎల్‌‌‌‌‌‌‌‌ఓఐ) ఇచ్చారని తెలిపారు.  2016 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 20న సింగరేణి కాలరీస్‌‌‌‌‌‌‌‌, టీఎస్‌‌‌‌‌‌‌‌జెన్‌‌‌‌‌‌‌‌కో మధ్య కుదిరిన ఒప్పందంలో యాదాద్రి ప్లాంట్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన 14 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల బొగ్గులో 7 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నులు మాత్రమే సింగరేణి సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నారని, అదే ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 9న ఎంఎస్‌‌‌‌‌‌‌‌టీసీతో మరో ఒప్పందం చేసుకుని మిగిలిన 50 శాతం బొగ్గును దిగుమతి చేసుకోవాలని నిర్ణయించారని వివరించారు.

యాదాద్రి ప్లాంట్‌‌‌‌‌‌‌‌కు ఏడాదికి సుమారు 7 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల దిగుమతి బొగ్గును సరఫరా చేసేందుకు ఎంఎస్‌‌‌‌‌‌‌‌టీసీ అంగీకరించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా దిగుమతి బొగ్గును రవాణా చేసేందుకు రైల్వే శాఖకు కూడా లేఖలు రాశారని తెలిపారు. కానీ ఆ ఒప్పందాలు అమలు కాలేదని, చివరకు 2022 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 27న యాదాద్రికి అవసరమైన మొత్తం 14 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల బొగ్గును సింగరేణి నుంచే సరఫరా చేస్తామని మరో అవగాహన ఒప్పందం చేసుకున్నారని వివరించారు.  కాగా, 2022–23 నాటికి సింగరేణిలో ఏడాదికి జీ-9 గ్రేడ్‌‌‌‌‌‌‌‌ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం కేవలం 1.71 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నులు మాత్రమే ఉండగా.. యాదాద్రి ప్లాంట్‌‌‌‌‌‌‌‌కు 14 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల బొగ్గును ఎలా సరఫరా చేస్తారని భట్టి ప్రశ్నించారు.  ‘‘బొగ్గు కేటాయింపులు లేకుండానే పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తారా? బొగ్గు లేకపోతే ప్లాంట్‌‌‌‌‌‌‌‌ ఎలా నడుస్తుంది? ఈ అంశంపై హరీశ్‌‌‌‌‌‌‌‌రావు ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని భట్టి డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.

 
యాదాద్రి విద్యుత్‌‌‌‌‌‌‌‌ భారాన్ని 25 ఏండ్లు ప్రజలు మోయాల్సిందే!

యాదాద్రి పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ వల్ల వినియోగదారులపై పడుతున్న ఆర్థిక భారాన్ని  భట్టి విక్రమార్క వివరించారు. ‘కాకతీయ థర్మల్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో  విద్యుత్​ ఉత్పత్తి వ్యయం​యూనిట్‌‌‌‌‌‌‌‌కు రూ.4.17, భద్రాద్రి థర్మల్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో రూ.4.60 నుంచి రూ.5.10,  కానీ యాదాద్రి పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో ఉత్పత్తి వ్యయం రూ.6.66.  అంటే మిగిలిన ప్లాంట్ల కన్నా రూ.2 ఎక్కువగా ఉంది. ఇది దేశంలోని అన్ని థర్మల్​ప్లాంట్ల కన్నా ఎక్కువ.  మీ నిర్వాకం వల్లే ఇదంతా! మీరు తప్పు చేసి మా వల్ల ప్రజలపై భారం పడ్తున్నదంటారా?’’ అంటూ హరీశ్‌‌‌‌‌‌‌‌ను నిలదీశారు.

గనులకు దూరంగా యాదాద్రి ప్లాంట్​ ఏర్పాటుచేయడం వల్లే రవాణా తడిసి మోపెడై,  విద్యుత్​ ఉత్పత్తి వ్యయం పెరిగిందని,  దీని వల్ల 25 ఏండ్లపాటు ప్రజలపైనే భారం పడుతుందని తెలిపారు. ఈ పాపం ముమ్మాటికీ గత బీఆర్ఎస్​ సర్కారుదేనని మండిపడ్డారు. యాదాద్రి థర్మల్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ రెండేళ్లు ఆలస్యమవడానికి కూడా గత ప్రభుత్వ తప్పిదాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ‎గత పదేండ్ల పాలనలో సింగరేణికి అందుబాటులో ఉన్న బొగ్గు బ్లాకులను కాపాడుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 2014–2024 మధ్య 14  బొగ్గు బ్లాకులు మూతపడటంతో సుమారు 15 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయిందని తెలిపారు.  

నైనీ బొగ్గు కేటాయింపులపై దృష్టి

నైనీ బొగ్గుకు ఇప్పటికే ఇతర ప్లాంట్లకు కేటాయింపులు ఉన్నందున.. మొత్తం బొగ్గును యాదాద్రికి మళ్లించడం సాధ్యం కాదని భట్టి తెలిపారు. యాదాద్రికి ప్రత్యేకంగా కోల్‌‌‌‌‌‌‌‌ అలాట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం కోల్‌‌‌‌‌‌‌‌ ఇండియా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కమిటీ, కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డికి లేఖలు రాసి.. కేటాయింపుల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.  

వారానికి ఒకసారి ఆధారాలతో వాస్తవాలు బయటపెడ్తం

పదేండ్లు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పకుండా.. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ఏదిపడితే అది మాట్లాడటం సరికాదని హరీశ్‌‌‌‌‌‌‌‌రావునుద్దేశించి భట్టి చురకలంటించారు. ‘‘గత ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుంచుతాం. వారానికి ఒకసారి డాక్యుమెంటరీ ఆధారాలతో వాస్తవాలను ప్రజాక్షేత్రంలో పెడతాం’’ అని స్పష్టం చేశారు.

 
రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన విద్యుత్​ డిమాండ్​

రాష్ట్రంలో విద్యుత్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరిందని భట్టి తెలిపారు. ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలో పీక్‌‌‌‌‌‌‌‌ విద్యుత్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ 19,892 మెగావాట్లకు చేరిందన్నారు. దాదాపు 20 వేల మెగావాట్లకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరిగినప్పటికీ విద్యుత్‌‌‌‌‌‌‌‌ కోతలు లేకుండా సరఫరా కొనసాగిస్తున్నామని చెప్పారు. తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రమైన కర్నాటకలో పీక్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ 15 వేలు, ఏపీలో సుమారు 13 వేల మెగావాట్లుగా ఉందని వివరించారు.

హరీశ్​ ఈ ప్రశ్నకు జవాబు చెప్పు..
 
2022 ఏప్రిల్‌‌‌‌ 27న యాదాద్రి థర్మల్​ప్లాంట్‌‌‌‌కు ఏటా14 మిలియన్‌‌‌‌ టన్నుల జీ-9 గ్రేడ్‌‌‌‌ బొగ్గు సరఫరా చేసేలా సింగరేణితో ఒప్పందం చేసుకున్నారు. కానీ 2022-23 నాటికి సింగరేణిలో ఆ గ్రేడ్​ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం 1.71 మిలియన్‌‌‌‌ టన్నులు మాత్రమే. మరి యాదాద్రి ప్లాంట్‌‌‌‌కు 14 మిలియన్‌‌‌‌ టన్నుల బొగ్గును సింగరేణి ఎలా సరఫరా చేస్తుంది? 
- డిప్యూటీ సీఎం భట్టి 

హరీశ్​.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పు

 కాకతీయ థర్మల్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో  విద్యుత్​ ఉత్పత్తి వ్యయం​ యూనిట్‌‌‌‌‌‌‌‌కు రూ.4.17, భద్రాద్రి థర్మల్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ లో రూ.4.60,  కానీ యాదాద్రి పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో ఉత్పత్తి వ్యయం రూ.6.66. ఇది మీ నిర్వాకం కాదా? మీరు తప్పు చేసి మా వల్ల ప్రజలపై భారం పడ్తున్నదంటారా?
    2014–--2024 మధ్య 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయి. సుమారు 15 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. దీని వల్ల పవర్​ ప్లాంట్లకు బొగ్గు కొరత మొదలైంది. కానీ కొత్త బొగ్గు బ్లాకుల వేలంలో  పాల్గొనకుండా సింగరేణిని ఎందుకు అడ్డుకున్నారు? 
- డిప్యూటీ సీఎం భట్టి