V6 News

రుణమాఫీపై హరీశ్ పిటిషన్‌‌‌‌ డిస్మిస్..ప్రభుత్వ అభ్యంతరాన్ని సమర్థించిన హైకోర్టు 

రుణమాఫీపై హరీశ్ పిటిషన్‌‌‌‌ డిస్మిస్..ప్రభుత్వ అభ్యంతరాన్ని సమర్థించిన హైకోర్టు 
  • పిటిషన్ ఉపసంహరించుకున్న హరీశ్ రావు 

హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట నియోజకవర్గంలో రైతులకు రుణమాఫీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మాజీ మంత్రి టి.హరీశ్‌‌‌‌రావు గురువారం ఉపసంహరించుకున్నారు. హరీశ్‌‌‌‌రావు దాఖలు చేసిన పిటిషన్​ను గురువారం జస్టిస్‌‌‌‌ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది రామవరపు చంద్రశేఖర్‌‌‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ రూ.2 లక్షలోపు రుణమాఫీకి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా అంతకంటే ఎక్కువ తీసుకున్నారన్న కారణంగా పలువురికి పథకాన్ని అమలు చేయలేదన్నారు.

గతంలో కూడా ఇలాంటి సందర్భాల్లో కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది ఇది ప్రజాప్రయోజనాలకు చెందిన విషయమని, కావాలంటే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసుకోవచ్చన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రజాప్రయోజనాలకు చెందిన అంశంపై దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌పై ఉత్తర్వులు ఇవ్వలేమనగా పిల్‌‌‌‌గా మార్పు చేసి బెంచ్‌‌‌‌కు నివేదించాలని న్యాయవాది కోరారు. దీనికి న్యాయమూర్తి నిరాకరిస్తూ ఉపసంహరించుకుని తాజాగా పిటిషన్‌‌‌‌ దాఖలు చేసుకోవాలనడంతో న్యాయవాది పిటిషన్‌‌‌‌ను ఉపసంహరించుకుంటామని చెప్పారు. దీనికి అనుమతిస్తూ న్యాయమూర్తి పిటిషన్‌‌‌‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.