సెక్రటేరియేట్‌‌ పైనుంచి దూకి.. ఆఫీసర్ ఆత్మహత్య

సెక్రటేరియేట్‌‌ పైనుంచి దూకి.. ఆఫీసర్ ఆత్మహత్య
  • హర్యానాలో కలకలం

చండీగఢ్‌‌: హర్యానా స్టేట్‌‌ సెక్రటేరియెట్‌‌ బిల్డింగ్‌‌ నుంచి దూకి ఓ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. స్పెషల్‌‌ సెక్రటరీగా పనిచేస్తున్న గణేష్‌‌ దాస్‌‌ అరోరా(58) సెక్రటేరియెట్‌‌ భవనం ఆరో అంతస్తు నుంచి దూకడంతో స్పాట్‌‌లోనే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

 బుధవారం మధ్యాహ్నం తన ఆఫీస్‌‌లో ఉన్న అరోరా ఉన్నట్టుండి సీటులోంచి లేచి నేరుగా ఆరో ఫ్లోర్‌‌‌‌ బాల్కనీలోకి వెళ్లారు. భద్రతా సిబ్బంది గమనించి అడ్డుకునేలోపే ఆయన కిందకు దూకేశారని ప్రత్యక్ష శాక్షులు తెలిపారు. తీవ్రగాయాలైన అరోరాను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

 తన నిర్ణయానికి ఎవరూ బాధ్యులు కారని, కుటుంబం నుంచిగానీ, ఆఫీస్‌‌ నుంచిగానీ తనపై ఎటువంటి ఒత్తిడి లేదంటూ అరోరా రాసిన సూసైడ్‌‌ నోట్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇటీవల ఆయన ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీ అయ్యారని, దాంతో కొంతకాలంగా మనస్థాపంతో ఉంటున్నారని తోటి ఉద్యోగులు చెప్తున్నారు. 

సీనియర్‌‌‌‌ ఐఏఎస్‌‌ ఆఫీసర్‌‌‌‌ వద్ద స్పెషల్‌‌ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న అరోరా ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన భార్య హర్యానా రాజ్‌‌భవన్‌‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.