రష్యన్ అమ్మాయితో పెండ్లి చేసి జాబ్ ఇప్పిస్తమన్నరు

రష్యన్ అమ్మాయితో పెండ్లి చేసి జాబ్ ఇప్పిస్తమన్నరు
  •     ఒప్పుకోలేదని శారీరకంగా టార్చర్ చేసి నరకం చూపెట్టారు
  •     రష్యన్ క్యాంపులో చిక్కి తిరిగొచ్చిన హర్యానా యువకుల ఆవేదన
 

చండీగఢ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం.. హర్యానాకు చెందిన ఇద్దరు యువకులకు జీవితాంతం గుర్తుండిపోయే నరకాన్ని చూపించింది.  ఆ ఇద్దరూ ఉద్యోగాల కోసం రష్యా వెళ్లి అక్కడి క్యాంపులో బందీలుగా చిక్కి చిత్రహింసలకు గురయ్యారు. ఎట్టకేలకు అతికష్టం మీద ఇటీవల ఇండియాకు తిరిగొచ్చారు. ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల చేతిలో మోసపోయి, రష్యాలో పడిన కష్టాలను మీడియాకు వివరించారు. హర్యానాలోని కర్నాల్ ఏరియాకు చెందిన ముఖేశ్(21), సన్నీ(24) అనే యువకులు ఇద్దరూ బంధువులు. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించారు. అప్పుడే వీరికి ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు పరిచయం అయ్యారు. జర్మనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ముఖేశ్, సన్నీని ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు నమ్మించారు. పర్మనెంట్ వర్క్ వీసా ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర రూ.35 లక్షలు చొప్పున   వసూలు చేశారు. అయితే, ముఖేశ్, సన్నీని ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు జర్మనీకి బదులుగా బ్యాంకాక్‌‌‌‌కు పంపారు. అక్కడి నుంచి విమానంలో బెలారస్‌‌కు తీసుకెళ్లారు. మళ్లీ  అక్కడి నుంచి అడవుల గుండా రష్యాలోకి తీసుకెళ్లి.. అక్కడున్న రష్యన్ ఆర్మీ క్యాంపుల్లో వదిలేశారు.

ఆర్మీలో చేరాలని మభ్యపెట్టారు

ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు తమను రష్యన్ ఆర్మీ క్యాంపులో వదిలేసి వెళ్లిపోయారని ముఖేశ్, సన్నీ తెలిపారు. ఉక్రెయిన్​తో యుద్ధం చేయడానికి ఆర్మీలో జాయిన్ కావాలని రష్యా అధికారులు తమను కోరినట్లు చెప్పారు. అయితే, అందుకు తాము ఒప్పుకోలేదన్నారు. రష్యా సైన్యంలో చేరితే రష్యన్ వర్క్ పర్మిట్‌‌తోపాటు రష్యన్ అమ్మాయితో పెండ్లి చేయించి రష్యన్ పాస్‌‌పోర్ట్‌‌ ఇస్తామని అధికారులు ఆఫర్‌‌ చేశారని వివరించారు. అయినా తాము ఒప్పుకోకపోవడంతో ఇద్దరిని శారీరకంగా, మానసికంగా హింసించారని తెలిపారు. శరీరంపై వాతలు పెట్టడంతోపాటు మంచు మీద పడుకోబెట్టారని.. తుపాకులు, కత్తులతో గాయపరిచారని వివరించారు. 15 రోజులు ఆహారం, నీరు ఇవ్వలేదని వాపోయారు. అయినా, తాము ఒప్పుకోకపోవడంతో రష్యాలోకి అక్రమంగా ప్రవేశించినందుకు మాస్కోలోని జైలులో వేశారని చెప్పారు. ఓ అడ్వకేటుకు రూ.6 లక్షలు చెల్లించి మాస్కో జైలు నుంచి బయటపడ్డామని ఇద్దరు యువకులు వెల్లడించారు. 

మా లెక్క 200 మంది ఉన్నరు

రష్యా సైన్యంలో చేరితే నెలకు రూ. 2.5 లక్షలు సంపాదించవచ్చని..రష్యన్ పాస్‌‌పోర్ట్‌‌లు కూడా ఇప్పిస్తామని ఏజెంట్లు మోసం చేస్తున్నారని ముఖేశ్, సన్నీ తెలిపారు. ఇప్పటిదాకా ఇలా వాళ్లు 200 మందిని రష్యాకు చేర్చారని..ఆర్మీలో జాయిన్ కావడానికి ఒప్పుకోనివారికి నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి అస్త్రంగా అక్రమంగా సరిహద్దు దాటినందుకు జైలుకు పంపి 10 ఏండ్ల పాటు జైల్లో ఉంచుతామని బెదిరించి ఆర్మీలో జాయిన్ చేయించుకుంటున్నారని చెప్పారు. వారందరిని ఉక్రెయిన్​తో యుద్ధానికి పంపుతున్నారని వివరించారు. 

ఆరుగురిపై కేసు

ముఖేశ్, సన్నీ సురక్షితంగా తిరిగి ఇండియాకు  రావడంపై వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే.. వారిని మోసం చేసిన  ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో మధుబన్ పోలీసులు ఒక మహిళతో సహా ఆరుగురు ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లపై సెక్షన్ 402, 420 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.