నీ కాల్‌ రికార్డ్స్‌ నాదగ్గరున్నయ్: కశ్మీర్‌‌కు పంపుతా జాగ్రత్త

నీ కాల్‌ రికార్డ్స్‌ నాదగ్గరున్నయ్: కశ్మీర్‌‌కు పంపుతా జాగ్రత్త
  • ఈస్ట్ మిడ్నాపూర్‌‌ ఎస్పీకి బీజేపీ నేత సువేందు అధికారి బెదిరింపు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా ఎస్పీని కశ్మీర్‌‌కు ట్రాన్స్‌ఫర్ చేయిస్తానంటూ బెదిరించి వివాదంలో చిక్కుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం ఈస్ట్‌ మిడ్నాపూర్‌‌ ఎస్పీ కె.అమర్‌‌నాథ్‌కు  మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ఆఫీస్‌ నుంచి వచ్చిన ఫోన్లకు సంబంధించిన కాల్‌ రికార్డ్స్ తన దగ్గర ఉందని, జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఈ హెచ్చరిక చేశారు. ‘‘ఒక కుర్రాడు ఇక్కడికి ఎస్పీ (అమర్‌‌నాథ్‌ కె)గా వచ్చాడు. నేను ఇక్కడ సీనియర్‌‌ ప్లేయర్‌‌ను. నీ ప్లాన్స్‌ గురించి నాకు అంతా తెలుసు. నువ్వు ఏం సెంట్రల్ కేడర్ ఆఫీసర్‌‌వి అని గుర్తు పెట్టుకో. నిన్ను కశ్మీర్‌‌లోని బారాముల్లా లేదా అనంత్‌నాగ్‌కు పంపగలను. జాగ్రత్త. నీకు మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ అల్లుడు ఆఫీస్‌ నుంచి వస్తున్న అన్ని ఫోన్ కాల్స్ రికార్డ్స్‌ నా దగ్గర ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నీకు అండగా ఉందని అనుకుంటున్నావేమో.. మాతో కేంద్ర ప్రభుత్వం ఉంది” అని సువేందు అన్నారు. తప్పుడు కేసులతో జిల్లాలో జాతీయవాద శక్తులను అడ్డుకోలేరని, తాను సీబీఐ ఇన్వెస్టిగేషన్ కోరుతానని ఎస్పీని హెచ్చరించారు. తమ్లుక్‌లో ఎస్పీ ఆఫీస్‌ సమీపంలో సోమవారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సువేందు అధికారి బీజేపీకి చేరి, మమతా బెనర్జీపై పోటీ చేసి ఆమెను ఓడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక పాత ఘటనల్లో కేసులను తిరగదోడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పై వ్యాఖ్యలు చేశారు. సువేందు అధికారి కామెంట్స్‌పై తమ్లుక్‌ పోలీసులు సుమోటోగా కేసును నమోదు చేశారు. అఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌‌ రిజిస్టర్ చేశారు.
మమతపై కుట్రలకు సాక్ష్యమిదే..
సువేందు అధికారి వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ కునాల్ ఘోష్ స్పందించారు. సువేందు కామెంట్స్‌పై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. సువేందు హద్దులు లేని అవకాశవాది (లిమిట్‌లెస్ ఆపర్చ్యునిస్ట్) అని కునాల్ ఆరోపించారు. ఆయన దగ్గర పోలీస్ అధికారులు, తృణమూల్ నేతల కాల్‌ రికార్డింగ్స్‌ ఉన్నాయని ఓపెన్‌గా చెబుతున్నారని, మమతా బెనర్జీ, అభిషేక్‌ బెనర్జీలపై కుట్రలు జరుగుతున్నాయనడానికి ఇదే సాక్ష్యమని అన్నారు. వెంటనే సువేందును పోలీస్ కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేయాలని డిమాండ్ చేశారు.