HDFC బ్యాంకులో వడ్డీ స్కామ్.. బయటపడ్డ రూ.45 కోట్ల రహస్య చెల్లింపుల మ్యాటర్!

HDFC బ్యాంకులో వడ్డీ స్కామ్.. బయటపడ్డ రూ.45 కోట్ల రహస్య చెల్లింపుల మ్యాటర్!

దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకుల జాబితాలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వరుస వివాదాల్లో కొనసాగుతోంది. కొన్ని రోజుల కిందట బ్యాంక్ ఉన్నత అధికారి ఒకరు సంస్థలో జరుగుతున్న అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రిజైన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో లోపల కార్పొరేట్ కార్యకలాపాలపై ఆందోళనలు మెుదలయ్యాయి. అసలు నిజంగానే అంతా సజావుగా ఉందా లేక కవరప్ జరుగుతోందా అనేదానిపై రిజర్వు బ్యాంక్ కూడా ఆరా తీసింది. ఇదే క్రమంలో మరోసారి HDFC బ్యాంకు వార్తల్లో నిలిచింది. 

వివరాల్లోకి వెళితే.. HDFC చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం ముసురుకుంది. ఒకవైపు షేర్ల పతనం, మరోవైపు అంతర్గత విచారణలో బయటపడ్డ దిగ్భ్రాంతికర నిజాలు బ్యాంకింగ్ రంగంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీంతో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు దాదాపు 2 శాతం పడిపోయి రూ.763.80 వద్ద ట్రేడవుతున్నాయి. 

అసలు జరిగింది ఇదే..
మహారాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డిపాజిట్లకు సంబంధించి రూ.45 కోట్ల మేర అదనపు వడ్డీని బ్యాంక్ చెల్లించటమే ప్రస్తుత వివాదానికి కారణం. ఈ డబ్బును నేరుగా వడ్డీ రూపంలో ఇవ్వకుండా.. బ్యాంక్ మార్కెటింగ్ శాఖ ద్వారా రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ అదేనండి రహదారి భద్రత ప్రచారం కోసం ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపించటంతో ఏదో తేడా జరిగిందని తెలుస్తోంది. నలుగురు స్థానిక వెండర్ల ద్వారా ఈ నిధులను మళ్లించి, వడ్డీ చెల్లింపులను మార్కెటింగ్ ఖర్చులుగా చిత్రీకరించినట్లు బ్యాంక్ అంతర్గత విజిలెన్స్ విచారణలో తేలింది.

వడ్డీ చెల్లింపులను మార్కెటింగ్ ఖర్చులుగా చూపించడానికి తమ డిపార్ట్మెంట్ మధ్యవర్తిలాగా పనిచేసిందని బ్యాంక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రవి సంతానం స్వయంగా విచారణలో అంగీకరించడం గమనార్హం.

ALSO READ : రెండో రోజూ బంగారం రేట్లు నేలచూపులు..

ముందుగానే పసిగట్టి తప్పుకున్న చైర్మన్?
మార్చి 12న బ్యాంక్ ఆడిట్ కమిటీ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఆశ్చర్యకరంగా ఈ విచారణ మొదలైన కొద్దిరోజులకే.. మార్చి 18న బ్యాంక్ చైర్మన్ అటాను చక్రవర్తి తన పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేశారు. బ్యాంక్‌లో జరుగుతున్న కొన్ని పద్ధతులు, పరిణామాలు తన వ్యక్తిగత విలువలకు, నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొనడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఈ రహస్య ఒప్పందానికి సంబంధించిన మౌఖిక చర్చల్లో బ్యాంక్ ఎండీ & సీఈఓ శశిధర్ జగదీశన్ కూడా పాల్గొన్నట్లు అంతర్గత రికార్డులు చెబుతున్నాయి. MSRDC నష్టాన్ని ఎలా భర్తీ చేయాలనే విషయమై జరిగిన కాల్‌లో ఆయన ఉన్నారని, మార్కెటింగ్ బడ్జెట్ ద్వారా ఈ సర్దుబాటు చేయడానికి ఆమోదం తెలిపారని సమాచారం. ఈ విజిలెన్స్ నివేదికను ఏప్రిల్ నెలలోనే బ్యాంక్ ఆడిట్ కమిటీకి, నియామకాల కమిటీకి సమర్పించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం బయటకు రావడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది.