సెహ్వాగ్‌లా టెస్టుల్లో హిట్‌మ్యాన్‌ చెలరేగుతాడు

సెహ్వాగ్‌లా టెస్టుల్లో హిట్‌మ్యాన్‌ చెలరేగుతాడు

న్యూఢిల్లీ: వీరేంద్ర సెహ్వాగ్‌ పేరు వినగానే క్రికెట్ ఫ్యాన్స్‌ శివాలెత్తుతారు. క్రీజులో ఉన్నంత సేపు తన స్ట్రోక్ ప్లేతో వీరూ ఉర్రూతలూగించాడు. ముఖ్యంగా టెస్టుల్లో తన స్టైల్ ఆఫ్ షాట్ మేకింగ్‌తో ప్రత్యర్థులను భయపెట్టాడు. అందుకే కొత్త ప్లేయర్లు ఎవరైనా స్ట్రోక్ మేకింగ్‌లో రాణిస్తే వీరూతో పోలుస్తుంటారు విశ్లేషకులు. తాజాగా అలాంటి పోలికే తెచ్చాడు మాజీ ఆల్‌రౌంటర్ ఇర్ఫాన్ పఠాన్. మిడిలార్డర్‌‌ బ్యాట్స్‌మన్‌గా కెరీర్‌‌ను ప్రారంభించిన హిట్‌మ్యాన్ ఓపెనర్‌‌గా ప్రమోషన్ వచ్చాక చెలరేగి ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెస్టుల్లో వీరూ తర్వాత ఇండియా తరఫున అంత ప్రమాదకర బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ అయ్యే చాన్సెస్ ఉన్నాయని పఠాన్ అంచనా వేశాడు.

‘ఓపెనర్‌‌గా వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన రోహిత్‌.. టెస్టుల్లోనూ డబుల్ కొడతాడేమో చూడాలి. రాబోయే సంవత్సరాల్లో టెస్టుల్లో సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే అతడు ఆ ఫీట్‌ను సాధించొచ్చు. ఫిట్‌గా ఉంటే రోహిత్ సెహ్వాగ్‌లా ఆడగలడు. టెస్టు క్రికెట్‌లో కూడా రోహిత్ ఓపెనర్‌‌గా ఆడుతున్నాడు. మొత్తంగా రోహిత్ టెస్టు కెరీర్‌‌ ఇప్పుడు విభిన్నంగా కనిపిస్తోంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఉన్నప్పుడు టెస్టుల్లో మనం ఆశించినంతగా అతడు సక్సెస్ కాలేకపోయాడు. సుదీర్ఘ కెరీర్ గురించి ఎప్పుడూ ప్రశ్నలు తలెత్తుతాయి. సెహ్వాగ్ వంద టెస్టులు ఆడాడు. రోహిత్ వన్డే క్రికెట్‌లో చాంపియన్. వన్డే హిస్టరీలో నా టాప్ 3 ఓపెనర్స్‌ లిస్ట్‌లో అతడు ఉన్నాడు. టెస్టుల విషయానికొస్తే అతడు కాస్త వెనుకంజలో ఉన్నాడు. ఎందుకంటే అతడు అన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు’ అని పఠాన్ చెప్పాడు.