భార్యను తిట్టాడని ఫ్రెండ్​ను చంపేశాడు

భార్యను తిట్టాడని ఫ్రెండ్​ను చంపేశాడు

ఈ నెల 16న లింగంపల్లిలో ఘటన

 తాగిన మైకంలో హత్య నిందితుడు అరెస్ట్

చందానగర్, వెలుగు: మద్యం మత్తులో ఫ్రెండ్స్ మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. తన భార్యను తిట్టాడని తాగిన మైకంలో ఫ్రెండ్ ను హత్య చేసిన నిందితుడిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 16న లింగంపల్లిలో జరిగిన ఈ మర్డర్ కి సంబంధించిన విషయాలను సోమవారం చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ రవీందర్ వివరాలు చెప్పారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పిట్టలగిరి ప్రాంతానికి చెందిన సయ్యద్ అబ్దుల్ షరీఫ్​(50) చందానగర్ లోని గంగారంలో ఉంటూ హోటల్ లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై అబ్దుల్ షరీఫ్​ను అతడి భార్య ఏడాది క్రితం వదిలివెళ్లిపోయింది. అప్పటి నుంచి షరీఫ్​తన ఫ్రెండ్స్ లింగంపల్లికి చెందిన రామ్ జీ, రాజశేఖర్ రెడ్డి(43), సిద్ధుతో కలిసి మద్యం తాగుతుండేవాడు.

ఈ నెల 16న లింగంపల్లిలోని ఓల్డ్ ఎంఐజీలో ఉన్న రామ్ జీ ఇల్లు ఫ్లాట్ నం.1879లో అబ్దుల్ షరీఫ్, రాజశేఖర్ రెడ్డి, సిద్ధు అందరూ కలిసి మద్యం తాగారు. అర్ధరాత్రి సమయంలో రామ్ జీ నిద్రపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి, సిద్ధు, షరీఫ్ తాగుతూనే ఉన్నారు. తాగిన మత్తులో రాజశేఖర్ రెడ్డి..షరీఫ్​ను, అతడి భార్యను అసభ్య పదాలతో తిట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన షరీఫ్ ఆ ఇంట్లో ఉన్న స్టీల్రాడ్ తో రాజశేఖర్ రెడ్డి తలపై బలంగా నాలుగైదు సార్లు కొట్టాడు. దీంతో రాజశేఖర్ రెడ్డి అక్కడిక్కడే చనిపోయాడు. షరీఫ్​అక్కిడినుంచి పారిపోయాడు. మరుసటి రోజు సాయంత్రం నిద్రలేచిన రామ్ జీ..రాజశేఖర్ రెడ్డి డెడ్ బాడీ చూశాడు. వెంటనే రామ్ జీ చందానగర్ పోలీసులకు సమాచారం అందించాడు. రాజశేఖర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన  కంప్లయింట్ మేరకు  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం నిందితుడు షరీఫ్​ను  పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించారు.