ఆరోగ్యంతోనే అందం ముడిపడి ఉంటది: ఈషా రెబ్బ

ఆరోగ్యంతోనే అందం ముడిపడి ఉంటది: ఈషా రెబ్బ

తెలుగు తెరపై తనదైన ముద్ర వేస్తూ, పక్కింటి అమ్మాయిలా కనిపించే అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న నటి ఈషా రెబ్బ. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అనతి కాలంలోనే తన ప్రతిభతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా, ఫిట్‌నెస్ విషయంలోనూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఈషా రెబ్బ కెరీర్‌ను పరిశీలిస్తే.. 'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో వెండితెరకు పరిచయమై తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'అమీ తుమీ', 'దర్శకుడు', 'అ' వంటి వైవిధ్యమైన సినిమాలతో తన నటనలోని వైవిధ్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ సరసన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో నటించి మెప్పించింది. కేవలం సినిమాల్లోనే కాకుండా ఓటీటీ ప్రపంచంలో కూడా 'లస్ట్ స్టోరీస్' వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా తన పరిధిని విస్తరించుకుంది. ప్రస్తుతం ఈషా పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అగ్ర నిర్మాణ సంస్థల సినిమాలతో పాటు, ఇతర భాషా చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుంటూ తన హవా కొనసాగిస్తోంది.

తాజాగా ఈషా రెబ్బ గాజువాకలో కలర్స్ హెల్త్ కేర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన అందం వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకున్నారు. "ఆరోగ్యంతోనే అందం ముడిపడి ఉంటుంది" అని.. శారీరక ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే ముఖంలో సహజమైన మెరుపు వస్తుందని ఆమె వ్యక్తం చేశారు. కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాకుండా, క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉంటాయని అన్నారు.