
బస్తీలోని సుస్తిని దూరం చేసేదే బస్తీ దవాఖాన అని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బస్తీ దవాఖానాలు కాస్తా దోస్తీ దవాఖానాలుగా మారాయని ఆయన అన్నారు. ఓల్డ్ బోయిన్ పల్లి శాంతినికేతన్ కాలనీలో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు కూడా పాల్గొన్నారు. బస్తీ దవాఖాన వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. శ్రీకాంతా చారి లాంటి ఎంతోమంది త్యాగదనుల వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘దేశంలో మొదటి సారిగా బస్తీ దవాఖాన ప్రారంభించిన ఘనత మన రాష్ట్రానిదే. హైద్రాబాద్ లో ప్రారంభమైన బస్తీ దవాఖానాలను మోడల్ గా తీసుకొని దేశవ్యాప్తంగా అమలు చేయాలని 15వ ఆర్ధిక సంఘం సూచించింది. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని జిల్లాల నుంచి కూడా డిమాండ్ వస్తోంది. త్వరలోనే జిల్లాల్లో 144 బస్తి దవాఖానాలను ఏర్పాటు చేయబోతున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ రోజు 32 బస్తీ దవాఖానలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే నగరంలో 226 బస్తీ దవాఖానాలు అందుబాటులో వచ్చాయి. ఇవాళ ప్రారంభం కానున్న 32 బస్తీ దవాఖానాలతో కలిపి 258కి చేరుకోనున్నాయి. మరో 92 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వాటిని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. బస్తీ దవాఖానాల ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని పరీక్షలు చేస్తున్నాం. ఇప్పటికే 11 లక్షల మందికి ఉచిత పరీక్షలు చేశాం. వాటి రిపోర్ట్స్ నేరుగా మొబైల్ కి వస్తున్నాయ్. సిటీలో త్వరలో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించబోతున్నాం. ఒక్కో ఆసుపత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటుచేస్తాం. ఆ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్ త్వరలో శంఖుస్థాపన చేయనున్నారు.
ఒమిక్రాన్ ను ఎదుర్కొవడం కోసం సిద్ధంగా ఉన్నాం
ప్రపంచంలో కొత్తగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వైరసును ఎదుర్కొవడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ‘ఒమిక్రాన్ ను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదర్కొవడం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. కరోనాను ఎదుర్కోవడం ప్రజల చేతుల్లోనే ఉంది. మూడు ముఖ్యమైన పద్దతుల ద్వారా వైరస్ ను అడ్డుకోవచ్చు. వాక్సిన్ వేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం.. ఈ మూడు చేస్తే చాలు. ఇంకా టీకాలు వేసుకోవడానికి ప్రజలు భయపడుతున్నరు. టీకాలు వేసుకుంటే ప్రాణాపాయం ఉండదు. కార్పొరేటర్ ఎన్నికలప్పుడు ఓటు కోసం ఎలా వెళ్లారో.. ఇప్పుడు కూడా ఇంటింటికి వెళ్లి మరీ కార్పొరేటర్ వ్యాక్సిన్ వేయించాలి. ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా మన రాష్ట్రానికి రాలేదు. పక్కనున్న కర్ణాటకలో వచ్చిందని కేంద్ర వైద్య అధికారులు చెప్పారు. హైదరాబాద్ కు వచ్చేవారికి ఎయిర్ పోర్టులోనే టెస్టులు చేస్తున్నాం.