మదనాపురం,వెలుగు:గూగుల్ మ్యాప్ చూసుకుంటూ.. ఓ డ్రైవర్ లారీతో సహా నదిలోకి వెళ్లాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... బాషా అనే వ్యక్తి ఏపీలోని బేతంచర్ల నుంచి తెలంగాణలోని మక్తల్ పట్టణానికి బండల లోడు లారీని తీసుకొని వస్తున్నాడు.
కొత్తకోట మండల పరిధిలోని నేషనల్ హైవే 44 మీదుగా ఆత్మకూరు నుంచి మక్తల్ వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకున్నాడు. తెల్లవారుజామున కావడం, రూట్ అడిగేందుకు ఎవరూ లేకపోవడంతో గూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవింగ్ కొనసాగించాడు. ఆత్మకూరు వద్ద కుడి వైపునకు వెళ్లకుండా.. ఎదురుగా ఉన్న దారిలో మూడు కిలోమీటర్ల వరకు ప్రయాణం కొనసాగించాడు. దీంతో లారీ కాస్త లోయర్ జూరాల నదిలోకి వెళ్లింది. కొద్దిదూరం వెళ్లాక ఎదురుగా నీళ్లు కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన డ్రైవర్ వెంటనే లారీని ఆపేశాడు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. బండలను అన్‌లోడ్ చేసి లారీని బయటకు తీశారు.
