బీమాలో 100% విదేశీ పెట్టుబడులతో పాలసీదారుల భద్రత ప్రశ్నార్థకం!

బీమాలో 100% విదేశీ పెట్టుబడులతో  పాలసీదారుల భద్రత ప్రశ్నార్థకం!

దేశీయ బీమా రంగం పరదేశీ సంస్థల గుప్పెట్లోకి వెళ్తుందా  అంటే  అవునని  చెప్పకతప్పదు. 2000 సంవత్సరంలోనే ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం బీమారంగంలో 26 శాతానికి  ప్రైవేట్ విదేశీ పెట్టుబడులకు ఆహ్వానించింది. ఆ తరువాత 2008లో  అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచాలని నిర్ణయించింది. అయితే, ఈ బిల్లును బీజేపీతో సహా వామపక్ష పార్టీలు నిరసన తెలపటంతో బిల్లు ఆమోదం పొందలేదు.  2014లో  అధికారంలోకి  వచ్చిన  మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బీమా రంగంలో 49 శాతం విదేశీ పెట్టుబడుల బిల్లు ఆమోదించింది. ఆ తరువాత 2018లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74 శాతానికి పెంచుతూ అనుమతి ఇచ్చింది.  అంటే  గడిచిన  పాతికేళ్లలో బీమా రంగంలో దశలవారీగా 74 శాతం వరకు విదేశీ  పెట్టుబడులను అనుమతించారు. దీంతో  దేశీయంగా బీమా రంగంలో 2024 మార్చి నాటికి విదేశీ పెట్టుబడులు 32.67 శాతంతో రూ.31,366 కోట్లకు  చేరినట్లు  కేంద్రం వెల్లడించింది.

ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయాలు

దేశ ఆర్థికవ్యవస్థకు వెన్నుదన్నుగా నిలబడిన ప్రభుత్వరంగ సంస్థల్లో  మోదీ సర్కార్  నూతన సంస్కరణ పేరుతో  విదేశీ సంస్థల  పెట్టుబడులను స్వాగతించింది.  వారికి  అవసరమైతే  మరిన్ని రాయితీలు కల్పిస్తామని  తెలిపింది. విదేశీ పెట్టుబడులకు  తలుపులు బార్లా తెరిచింది.  ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరించటం లేదా నష్టాల పేరుతో మూసివేయడం జరుగుతోంది.  లాభాలతో నడుస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి రూ.18 వేల కోట్లు షేర్ల రూపేణా  మోదీ  సన్నిహిత మిత్రుడుగా పేరుందిన  గౌతమ్ అదానీ వాణిజ్య గ్రూపులు నష్టాలతో  నడుస్తున్న వాటిలో పెట్టించినాడు. వారి ఒత్తిడికి తలవొగ్గి  బీమా రంగంలో 100%  ఎఫ్ డిఐలకు నిర్ణయించటమంటే   ప్రైవేట్​కు అప్పజెప్పటమే.

ఎల్ఐసి కీలక పాత్ర 

 దేశాభివృద్ధికి అత్యల్ప పెట్టుబడితో  దీర్ఘ కాలానికి ఎక్కువ మొత్తంలో ప్రజాధనం పోగు చేయగలిగే  ఏకైక రంగం బీమా రంగం.   ప్రజల విశ్వాసమే దానికి విలువైన పెట్టుబడి.  దేశ ఆర్థిక స్వావలంబనకు, మౌలిక వసతుల అభివృద్ధికి ఆవశ్యకమైన దీర్ఘకాలిక పెట్టుబడులను అతి తక్కువ వడ్డీకే  బీమా రంగం అందిస్తున్నది.  ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసి వల్లే  దేశంలో బీమా వ్యాప్తి పెరిగినట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. ఐఆర్డీఏఐ 2023–-24 నివేదిక ప్రకారం లక్షకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో ఎల్ఐసికి 18,580 శాఖలు ఉంటే,  ప్రైవేటు కంపెనీలకు 5,024 శాఖలు ఉన్నాయి. 10 వేల లోపు జనాభా ఉన్న చిన్న నగరాలు, పట్టణాల్లో ఎల్ఐసికి 1,224 శాఖలు ఉంటే,  ప్రైవేట్ కంపెనీలు 188 శాఖలు మాత్రమే ఉన్నాయి.  ఎక్కువ లాభాలు వచ్చే పట్టణ ప్రాంతాలపై అధికంగా దృష్టి సారిస్తున్న   ప్రైవేట్ సంస్థలు,   నష్టభయం కలిగిన గ్రామీణ ప్రాంత పేద ప్రజల చిన్న మొత్తాల పాలసీలను ఎల్ఐసికి వదిలేస్తున్నాయి.  విస్తృత జనావళికి అందుబాటులో ఉండడంతోపాటు బీమా వ్యాప్తిలో ఎల్ఐసి ప్రాధాన్యాన్ని  ఇది తేటతెల్లం చేస్తోంది.  అలాంటి కీలక  పెట్టుబడిలపై నియంత్రణలను విదేశీ కంపెనీలకు అప్పగించడం వల్ల  ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.  అయితే,  100% ఎఫ్​డిఐలతో  నష్టం ఉండదని,   బీమా చట్టాల(సవరణ) బిల్లు 2025తో   దేశ ప్రజలందరికీ 2047 నాటికి బీమా భరోసా లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం అంటోంది. పాలసీదారుల ప్రయోజనాల రక్షణకు, వారి ఆర్థిక భద్రతకు, భారతీయ బీమా మార్కెట్లో ప్రగతి,- మెరుగైన ఉద్యోగ అవకాశాలకే ఈ చట్టాల సవరణలతో విదేశీసంస్థలకు అనుమతిస్తున్నామని చెప్తున్నది.

పాలసీదారుల భద్రత ఎంతవరకు?

ఇప్పుడు  స్వదేశీ సంస్థలు లేదా స్వదేశీ /విదేశీ  కలయికలతో  ఏర్పడ్డ జాయింట్ వెంచర్లు బీమా సేవలను దేశ ప్రజలకు అందిస్తున్నాయి.  కానీ,  కేంద్ర  కేబినెట్ తాజా నిర్ణయంతో  కేవలం విదేశీ సంస్థలే ఇన్సూరెన్స్ సర్వీస్ ను అందించనున్నాయి.  ఇక్కడే భద్రతాపరమైన అనుమానాలు తలెత్తుతున్నాయి.  విదేశీ కంపెనీలు  వ్యాపార కోణంలోనే  బీమాను చూస్తాయి.  దాంతో  పాలసీదారులకు ఆశించిన భద్రత ఉంటుందా?  కంపెనీలు మూతపడితే బీమా భరోసా మాటేంటి? అనే  ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకే  పాలసీదారుల ప్రయోజనాలను కాపాడేలా విదేశీ సంస్థలకు  ముకుతాడు  వేయాల్సిన అవసరం ఉందని పలువురు ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు.  ఇప్పుడు రూపొందుతున్న చట్టంలో పాలసీదారులకు నిధి ఏర్పాటు, రక్షణలు, శాఖల విస్తరణ, నియామకాలు తదితర నిర్ణయాలు ఎల్ఐసి బోర్డుకు అధికారాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని.   పాలసీదారులకు రక్షణ కవచంగా చట్టంలో నిబంధనలు  పొందుపరచాలని కోరుతున్నారు.  బీమా కంపెనీలు, పాలసీదారుల మధ్య సంబంధాల పర్యవేక్షణ,    బీమా వ్యాపార కార్యకలాపాలపై నియంత్రణ  ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాలని,  పాలసీదారులకు రక్షణ కవచంగా ఉండాలని కోరుతున్నారు.

బిల్లుకు రంగం సిద్ధం

‘భారత్​లో ఆయా దేశాల కంపెనీలు స్వేచ్ఛగా  బీమా  వ్యాపారం  చేసుకోవడానికి 100 శాతం ఎఫ్  డిఐలను అనుమతించే  ప్రతిపాదనలు ఉన్నాయని’  2025–-26 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 1న ప్రకటించిన బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.  దానికి అనుగుణంగానే  ప్రధాని మోదీ అధ్యక్షతన డిసెంబర్ 12న జరిగిన కేంద్ర  కేబినెట్ భేటీలో 
ఈ నిర్ణయం వెలువడింది.  ఇందులో భాగంగానే ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్  డిఐ)కు పార్లమెంటు శీతాకాల సమావేశం ఈ నెల 19తో  ముగుస్తున్నందున ఈలోపే  బిల్లును ఆమోదానికి పెట్టాలని మోదీ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ‘సబ్ కా బీమా సబ్ కా రక్షా’ ( బీమా శాసనాల సవరణ చట్టం-2025) పేరుతో ఈ బిల్లు రూపుదిద్దుకుంది.  డ్రాఫ్ట్ బిల్లును సభ్యులకు సర్క్యులేట్ చేశారు. ఈ  సమావేశాల్లోనే ఆమోదించుకోవాలని ఆత్రుతతో ఉన్నారు.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- ఉజ్జిని 
రత్నాకర్​రావు,
ఏఐటీయూసీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి