కేటీఆర్.. ముందు కవిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వు : విప్ ఆది శ్రీనివాస్

కేటీఆర్.. ముందు కవిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వు : విప్ ఆది శ్రీనివాస్
  •     పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్​వెనకబడింది: విప్ ఆది శ్రీనివాస్
  •     కొండగట్టు ఆలయ భూసమస్య పరిష్కారిస్తమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సొంత చెల్లి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నలకు బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్​కేటీఆర్ ఎందుకు సమాధానం ఇవ్వండం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. భూకబ్జాదారులు, అవినీతి పరులతో కేటీఆర్​చేతులు కలిపిండనే కవిత ఆరోపణలపై జవాబు ఇవ్వాలన్నారు. పదేండ్ల బీఆర్ఎస్​పాలనలో జరిగిన అవినీతిపై కవిత వద్ద ఆధారాలు ఉంటే వాటిని ఆమె కోర్టుకు అందించాలని సూచించారు. 

మంగళవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆది శ్రీనివాస్​ఏదో 14 వేల ఓట్ల మెజారిటీతో మొదటిసారి గెలిచి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుండని కేటీఆర్ అంటున్నడు. అదో గెలుపా అని విమర్శిస్తున్నడు. మరి 2009లో ఆయన మొదటి సారి సిరిసిల్ల నుంచి కేవలం 171 ఓట్ల తేడాతో గెలిచాడు కదా? 14 వేల ఓట్ల ఆధిక్యంతో వేముల వాడలో గెలిచిన నాది విజయం కాదంటే.. ఆ రోజు సిరిసిల్లలో 171 ఓట్లతో గెలిచిన నీది ఎలా గెలుపు అవుతుంది కేటీఆర్?” అని ప్రశ్నించారు. ​లోక్​సభ ఎన్నికల్లో వలె పంచాయతీ ఎన్నికల్లో నూ బీఆర్ఎస్​చాలా వెనకబడిందని విమర్శించారు. 

సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్క మండలంలో పంచాయతీ ఎన్నికలు జరిగితే కేటీఆర్ విజయోత్సవ సభ పెట్టాడని, మిగతా మండలాల్లో జరగనున్న ఎన్నికల్లో గెలిచేందుకు ఈ గిమ్మిక్కులు చేస్తుండని ధ్వజమెత్తాడు. కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్ లుగా గెలవడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, ఆయనలో ఉన్న కడుపుమంట కనిపిస్తుందని ఫైర్ అయ్యారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నాడని, కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. 

రూ.150 కోట్లతో వేములవాడ డెవలప్​చేస్తున్నం

కొండగట్టు ఆలయ భూముల విషయంలో దేవాదాయ, అటవీశాఖల మధ్య హద్దుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో దేవాలయాలను ఒక కారిడార్ లా అభివృద్ధి చేస్తామని చెప్పారు. వేములవాడ ఆలయాన్ని రూ.150 కోట్లతో పునర్నిర్మిస్తున్నామని చెప్పారు. 

వంద కోట్ల రూపాయలతో మేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానన్న మాజీ సీఎం కేసీఆర్.. తన పదేండ్లలో పాలనలో ఒక్క పైసా ఇవ్వకుండా రాజన్నకే శఠగోపం పెట్టాడని విమర్శించారు. తన లగ్గం ఇక్కడే అయిందని, ఈ గుడిని అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్.. మళ్లీ కూడా ఇటు వైపు చూడలేదని విమర్శించారు.