మానవత్వం చచ్చిపోయింది: నడిరోడ్డుపై గుండెపోటు.. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు..

మానవత్వం చచ్చిపోయింది: నడిరోడ్డుపై గుండెపోటు.. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు..

మానవత్వం మచ్చుకైన కనిపించటం లేదు అనటానికి ఇదో ఎగ్జాంపుల్. రోడ్డుపై ఓ వ్యక్తి గుండెపోటుతో విలవిలలాడుతుంటే.. ఒక్కరు అంటే ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎవరికి వారే అన్నట్లు చూస్తూ వెళ్లిపోయారు. కనీసం అంబులెన్స్‎కు కాల్ చేయలేదు.. అది రాలేదు.. ఆ మనిషి అలాగే గుండెపోటుతో నడిరోడ్డుపై చనిపోయిన ఘటన బెంగళూరు సిటీలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

డిసెంబర్ 13న బనశంకరిలోని కదిరేనహళ్లి ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి బైక్‎పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుండె పోటు రావడంతో ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలిపోయాడు. దీంతో అతడి భార్య రోడ్డుపై వెళ్లే వారిని సహయం చేయాలని కోరింది. కానీ ఒక్కరూ కూడా ముందు రాలేదు. కనీసం అంబులెన్స్‎కు అయినా కాల్ చేయమని చేతులెత్తి వేడుకుంది. ఫోన్ కాదు కనీసం అటు వైపు కూడా ఎవరూ కన్నెత్తి చూడలేదు. 

ఎవరికి వారే చూస్తూ వెళ్లిపోయారు తప్ప ఒక్కరంటే ఒక్కరూ కూడా కనీస మానవత్వం చూపలేదు. ఎవరూ సహయం చేయకపోవడం, అంబులెన్స్ రాకపోవడంతో ఆ జంట ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించారు. గుండె పోటు ఎక్కువ కావడంతో అతడు ఆసుపత్రికి చేరుకోకముందే మార్గమధ్యలోనే మరణించాడు. సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకురాకపోవడం వల్లే ప్రాణాలు పోయాయని చెప్పడంతో మృతుడి భార్య తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహానికి గురైంది. 

ఒక్కరూ సహయం చేసిన తన భర్త బతికేవాడని గుండెలవిసేలా రోదించింది. మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోయిందంటూ దుఃఖంతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతుడి భార్య సహయం కోరటం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందని.. మచ్చుకైన కనిపించటం లేదనటానికి ఈ ఘటనే నిదర్శనమని మండిపడుతున్నారు.