ముంబై: టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ అనారోగ్యానికి గురయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా మంగళవారం (డిసెంబర్ 16) పూణేలోని ఏంసీఏ స్టేడియంలో రాజస్థాన్, ముంబై జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ అనంతరం ముంబై బ్యాటర్ జైస్వాల్ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో వెంటనే అతడిని జట్టు వైద్య సిబ్బంది ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అల్ట్రాసౌండ్ (USG), సీటీ స్కాన్‌లు చేసిన వైద్యులు.. జైస్వాల్ తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. అతనికి ఇంట్రావీనస్ మందులు కూడా ఇచ్చారు. మెడిసన్ వాడుతూ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో ముంబై తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్ 48.33 సగటు, 168.6 స్ట్రైక్ రేట్‌తో 145 పరుగులు చేశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై ఫైనల్‌కు చేరుకోకపోవడం, సౌతాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో 2026, జనవరి 11న న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ వరకు జైస్వాల్ విశ్రాంతి తీసుకోవచ్చు. గిల్ గాయం కారణంగా ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో జైస్వాల్‌కు టీమిండియాలో చోటు దక్కింది. తొలి రెండు వన్డేల్లో నిరాశ పర్చిన ఈ ముంబై బ్యాటర్.. మూడో వన్డేలో శతకంతో చెలరేగాడు. తద్వారా అంతర్జాతీయ వన్డే, టీ20, టెస్ట్ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన 7వ భారతీయ క్రికెటర్‌గా రికార్డ్ సాధించాడు.
