హైదరాబాద్ సిటీ మందు బాబులకు కంటిపై కునుకు లేకుండా చేసేది డ్రంక్ అండ్ డ్రైవ్. వీకెండ్ వచ్చిందంటే చాలు జాలీగా మందు కొట్టి ఎంజాయ్ చేద్దామనుకునే వాళ్లకు.. మొదటగా గుర్తుకొచ్చేది డ్రంక్ అండ్ డ్రైవ్ టెన్షన్. అలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లను క్లియర్ చేసేందుకు లంచాలు తీసుకుంటున్న ట్రాఫిక్ పోలీసుల బండారం ఇప్పుడు బయటపడింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మందు బాబుల నుంచి.. ఆ కేసులను క్లియర్ చేసేందుకు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేస్తున్న కమిషనర్ సజ్జనార్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న నర్సింగరావును బదిలీ చేశారు. అదే విధంగా ట్రాఫిక్ SI అశోక్, హోంగార్డ్ కేశవులను కూడా బదిలీ చేశారు కమిషనర్. వీళ్లకు సహకరిస్తున్న కోర్టు కానిస్టేబుల్ సుధాకర్ పైనా బదిలీ వేటు పడింది.
డ్రంక్ అండ్ డ్రవ్ చలాన్లను మాఫీ చేసేందుకు వీళ్లందరూ కలిసి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు రావటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు కమిషనర్ సజ్జనార్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఇప్పటికే నలుగురు ACPలు, నలుగురు ఇన్ స్పెక్టర్లపై వేటు వేసిన పోలీస్ కమిషనర్ సజ్జనార్.. ఇప్పుడు ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ లో జరుగుతున్న అవినీతిపైనా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐ నర్సింగరావుతోపాటు ఎస్సై, హోంగార్డ్, కోర్టు కానిస్టేబుల్ ను బదిలీ చేశారు.
