ఉద్యోగాల భర్తీలో కాంట్రాక్టు హెల్త్ స్టాఫ్​కు వెయిటేజీ

ఉద్యోగాల భర్తీలో కాంట్రాక్టు హెల్త్ స్టాఫ్​కు వెయిటేజీ

కామారెడ్డి, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూస్తామని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా, ఏరియా ఆస్పత్రులు సహా పీహెచ్​సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఒకవేళ ఎప్పుడైనా ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే, వెంటనే మందులు కొనుగోలు చేసేందుకు డాక్టర్ల వద్ద పైసలు ఉంచుతామన్నారు. అలాగే హెల్త్ డిపార్ట్ మెంట్​లో కాంట్రాక్ట్​ పద్ధతిలో పని చేస్తున్న డాక్టర్లు, ఏఎన్​ఎంలు, ఇతర స్టాఫ్​కు పర్మనెంట్ ఉద్యోగాల భర్తీలో వెయిటేజీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం కామారెడ్డిలో హరీశ్ రావు పర్యటించారు. జిల్లా ఆస్పత్రిని, మాతా శిశు సంరక్షణ కేంద్రం పనులను పరిశీలించారు. తర్వాత కలెక్టరేట్​లో ఆశ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లు, 4జీ సిమ్‌లను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆశ కార్యకర్తలందరికీ ఫోన్లు, సిమ్స్ పంపిణీ చేస్తామమన్నారు. గర్భిణులకు సంబంధించిన వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయాలన్నారు. అవసరమైతే డాక్టర్లకు వీడియో కాల్ చేసి రోగులకు ట్రీట్​మెంట్ ఇవ్వాలన్నారు. ఎక్కడా లేని విధంగా ఆశ కార్యకర్తలకు రూ.9,750 జీతం ఇస్తున్నామన్నారు. కరోనా టైమ్​లో ఆశాలు బాగా పని చేశారని ప్రశంసించారు.

బీపీ, షుగర్​ పేషెంట్లకు కిట్లు

పబ్లిక్ హెల్త్​లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని హరీశ్ చెప్పారు. ఫస్ట్ ప్లేస్ కు తీసుకెళ్లడమే లక్ష్యంగా హెల్త్ స్టాఫ్ పని చేయాలని సూచించారు. డెలివరీలన్నీ ప్రభుత్వ హాస్పిటళ్లలో జరిగేలా, మహిళల్లో రక్తహీనత లేకుండా చూడాలన్నారు. పీహెచ్​సీ డాక్టర్ల పని తీరుపై త్వరలో ఆన్​లైన్ లో రివ్యూ చేస్తానన్నారు. బీపీ, షుగర్ పేషెంట్లకు ఇక నుంచి కిట్లు అందజేస్తామని చెప్పారు. అందులో వాళ్లకు సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయన్నారు.