- పేపర్ కటింగ్ లు, వీడియో క్లిప్పుల ఆధారంగా ప్రశ్నించిన అడ్వకేట్లు
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విచారణ గురువారంతో పూర్తయింది. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో కడియం తరఫు అడ్వకేట్లు వివేకానందను సూమారు రెండున్నర గంటల పాటు విచారించారు. కడియం పార్టీ మారినట్లు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి? మీడియాలో వచ్చిన పేపర్ కటింగ్ లు, టీవీల్లో వచ్చిన వీడియో క్లిప్పుల ఆధారంగా ఆయన పార్టీ మారినట్లు ఎలా నిర్ధారిస్తారని కేపీ వివేకానందను ప్రశ్నించినట్లు తెలిసింది.
కడియం తన కూతురు కావ్య కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఆమెకు మద్దతుగా ప్రచారం చేశాడని, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశాడని అందుకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే స్పీకర్ కు అందజేసినట్లు విచారణ సందర్భంగా వివేకానంద చెప్పినట్లు సమాచారం. స్పీకర్ సమక్షంలో జరిగిన ఈ విచారణతో వివేకానంద క్రాస్ ఎగ్జామిన్ పూర్తయింది. త్వరలోనే వివేకానంద తరఫు అడ్వకేట్లు కడియంను తిరిగి క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఈ తర్వాత కడియం అనర్హత పిటిషన్ పై స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు.
బయట కాంగ్రెస్.. అసెంబ్లీలో బీఆర్ఎస్
విచారణ అనంతరం వివేకానంద మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరి బయట కాంగ్రెస్ అంటాడని, అసెంబ్లీ లోపల మాత్రం బీఆర్ఎస్ అంటాడని ధ్వజమెత్తారు. కడియంకు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పది మంది ఎమ్మెల్యేలు భయంతో ఉన్నారని, ఆ పది స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు ఇచ్చారని, ఆ కాపీలను ఇంతవరకు స్పీకర్ ఇవ్వలేదన్నారు.
ముందు దానం నాగేందర్ పై తీర్పు!
కడియంపై తీర్పు కన్నా ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తీర్పు రావాల్సి ఉంటుంది. ఆయనపై అనర్హత పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బుధవారం దానం తరఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. దానంను ఆ ఇద్దరు ఎమ్మెల్యేల తరఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. దీంతో దానంపై విచారణ ముగియనుంది.
ఆ వెంటనే స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల పై విచారణ పూర్తి చేసిన స్పీకర్.. వారిపై వేసిన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. దీంతో ఆ 8 మందికి క్లీన్ చిట్ లభించింది. మరి ఇప్పుడు దానం, కడియంలపై అనర్హత వేటు వేస్తారా, వారికీ క్లీన్ చిట్ ఇస్తారా? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్నది.
