- ప్రభుత్వం ఏ వర్గానికీ హామీలు అమలు చేయలేదు: కేటీఆర్
- గవర్నర్ ప్రసంగానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలని ప్రశ్న
- దళితుడిని సీఎం చేస్తామన్న మీ హామీ ఏమైందన్న వెంకట్‌రెడ్డి
- పదేండ్లలో ఒక్క రేషన్ కార్డయినా ఇచ్చారా? అని నిలదీత
- 6 గ్యారంటీల కింద ఒక్కో ఫ్యామిలీకి రూ.2.5 లక్షలు ఇవ్వాలన్న కేటీఆర్
- మీరు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ హామీలు అమలు చేస్తున్నామన్న భట్టి
- 1.06 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తున్నం..
- దీన్ని సువర్ణాక్షరాలతో రాయాలన్న డిప్యూటీ సీఎం
- హామీలు అమలు చేయని ఫ్లాప్ ప్రభుత్వమని కేటీఆర్ విమర్శ
- వరుసగా ఓడిపోతున్న బీఆర్‌ఎస్సే అట్టర్ ఫ్లాప్ అని శ్రీధర్‌బాబు కౌంటర్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా సాగాయి. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ముఖ్యంగా ఆరు గ్యారంటీలపై చట్టబద్ధతకు సంబంధించి కేటీఆర్ చేసిన విమర్శలకు మంత్రులు గట్టిగా బదులిచ్చారు. కేటీఆర్ మాట్లాడేటప్పుడు ఇటు కాంగ్రెస్ సభ్యులు.. కేటీఆర్ ప్రసంగంలో మంత్రులు జోక్యం చేసుకున్నప్పుడు అటు బీఆర్‌ఎస్ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు.
గవర్నర్ ప్రసంగానికి అసలు ఎందుకు.. ఎవరు ధన్యవాదాలు చెప్పాలి? అని కేటీఆర్ ప్రశ్నించారు. 100 రోజులపాటు గ్యారంటీ కార్డులను బీరువాలో భద్రంగా పెట్టుకోవాలని ఎన్నికలకు ముందు భట్టి విక్రమార్క చెప్పారని, కానీ, ఏ వర్గానికీ హామీలు అమలు చేయలేదని కేటీఆర్ అన్నారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కల్పించుకొని.. అసలు పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. మీ పాలనలో కనీసం ఒక్క రేషన్ కార్డయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు.
‘‘మీరు ఎన్ని హామీలు అమలు చేశారని మీ హయాంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పాలి? దళితుడిని సీఎం చేస్తామని మాటిచ్చి మోసం చేసినందుకా? దళితులకు దళితబంధు రానందుకా? దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వనందుకా? దేనికి మీ హయాంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పాలి? మీరు చేసిన అప్పులకు మేం ఇప్పుడు బాకీలు కడుతున్నాం’’ అని వెంకట్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ హయాంలో 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చారని స్వయంగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రక టించారని, ఒక మంత్రి చెప్పిన విషయాన్ని మరో మంత్రి తప్పు అంటున్నారని కేటీఆర్ విమర్శించారు. మీకు మీకు గొడవలుంటే అది తమకు సంబంధం లేదని పేర్కొన్నారు.
కోమటిరెడ్డి మాట్లాడుతున్నప్పుడు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణా రావు, పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుపడే ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి మాట్లాడిన తర్వాత బీఆర్‌ఎస్ సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడేందుకు ప్రయత్నించగా.. స్పీకర్ మైక్ ఇవ్వలేదు. కేటీఆర్ రిక్వెస్ట్ చేయడంతో ఆయనకు ఒక నిమిషం చాన్స్ ఇచ్చారు. దీంతో ‘స్పీకర్ ఒక్క కాంగ్రెస్‌కే స్పీకర్ కాదు.. అందరికీ’ అని తలసాని అనడంతో.. ‘అందుకే మైక్ ఇచ్చా’ అని స్పీకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతుంటే.. తాము అడ్డుపడలేదని, కానీ, తాము మాట్లాడుతుంటే మంత్రులు ఎందుకు అడ్డుతగులుతున్నారని, అది మంచిది కాదని తలసాని అన్నారు.
కేటీఆర్ వర్సెస్ భట్టి
స్పీచ్ సందర్భంగా ఆరు గ్యారంటీల కార్డును సభలో చూపించిన కేటీఆర్.. అన్ని గ్యారంటీలూ కలిపి ఒక్కో కుటుంబానికి ఏటా రూ.2.5 లక్షలు వేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అంటే రెండున్నరేండ్లలో ఒక్కో కుటుంబానికి కనీసం రూ.6.5 లక్షలు ఇవ్వాల్సి ఉందని, అసలు రెండున్నర లక్షలైనా వేశారా? అని ప్రశ్నించారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కల్పించుకొని.. కేటీఆర్ మొత్తం బ్లండర్
మాట్లాడారని అన్నారు.
కేటీఆర్ వర్సెస్ శ్రీధర్ బాబు
సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్తున్నారని, కేబినెట్ మీటింగ్‌లు కూడా అక్కడే పెడుతున్న సందర్భాలు వచ్చాయని కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి మూటలు మోయడం తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా గెలిచిందని, ఇక్కడ 420 కప్ పెడితే కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు. ఎన్నికలకు ముందు దానకర్ణుడిలాగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎన్నికలయ్యాక మాత్రం కుంభకర్ణుడిగా మారుతున్నారని విమర్శించారు. ఇది ఫ్లాప్ గవర్నమెంట్అని అన్నారు. దీనికి మంత్రి శ్రీధర్‌బాబు జవాబిచ్చారు. అసలు ఫ్లాప్ అయితున్నది బీఆర్‌ఎస్ పార్టీ అని అన్నారు.
‘‘ఫ్లాప్ అయినమని మీరు మమ్మల్ని అంటున్నరు. అసలు ఫ్లాప్ అయింది మీరు. అసెంబ్లీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బైపోల్, మున్సిపల్ ఎన్నికల్లో ఫ్లాప్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఒక్క సీటూ గెలవకుండా అట్టర్ ఫ్లాప్ అయ్యారు’’ అని ఎద్దేవా చేశారు. తమది నేషనల్ పార్టీ అని, ఢిల్లీ నుంచి రాజకీయం కచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలిస్తే తప్పేందని ప్రశ్నించారు.
అసలు ప్రాంతీయ పార్టీగా ఉండి బీఆర్‌ఎస్ నేతలు తమ కేసులు తప్పించుకునేందుకు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లారని శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. వెంటనే కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘మీరు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా మాకేం అభ్యంతరం లేదు.. కానీ, ఇక్కడి పైసలు అక్కడికిపోతయనే భయమే ఉంది. రాహుల్‌కు రూ.వెయ్యి కోట్లు ఇస్తామంటున్నారు కదా?” అని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వం అప్పుల కుప్ప చేసి రాష్ట్రాన్ని మాకు అప్పగించింది. అప్పులు తీర్చుకుంటూ.. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నం. ఆర్థిక భారం ఉన్నా రూపాయి రూపాయి పోగేసి పేదలకు హామీలను అమలు చేస్తున్నం. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ కూడా పేదల అభ్యున్నతి కోసం.. వారి మేలు కోసం పనిచేస్తున్నం. 54 లక్షల కుటుంబాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నం.
1.06 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తున్నం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సన్న బియ్యం ఇస్తున్నం. దీనిని సువర్ణాక్షరాలతో రాయాలి. పదేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చింది? మేం ఇచ్చిన హామీ మేరకు 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నం. రైతులకు పెట్టుబడి సాయం కింద 9 రోజుల్లో రూ.9 వేల కోట్లతో రైతుభరోసా నిధులు వేశాం.
