రాచకొండ, సైబరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత

రాచకొండ, సైబరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత

ఎల్ బీనగర్/గండిపేట, వెలుగు:  రంగారెడ్డి జిల్లాలోని రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఏపీలోని రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న వేర్వేరు గ్యాంగ్ లను పోలీసులు పట్టుకున్నారు. పెద్ద​అంబర్ పేట వద్ద రూ.కోటి విలువైన 450 కిలోల గంజాయి పట్టుబడగా.. శంకర్ పల్లిలో రూ.59 లక్షల విలువైన 228 కిలోల గంజాయిని సీజ్ చేశారు. పెద్ద అంబర్ పేటలో పట్టుబడ్డ గంజాయి వివరాలను గురువారం ఎల్ బీనగర్ లోని రాచకొండ కమిషనరేట్ క్యాంప్ ఆఫీసులో సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన మహ్మద్ బాబు మియా(39), సతీశ్​జాదవ్, సుభాష్ జాదవ్, బాబు కాలే, షేక్ అజాజ్ సికిందర్(27) ఐదుగురు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నుంచి గంజాయిని కొని మహారాష్ట్రకు తరలించేవారు. రంపచోడవరానికి చెందిన ధను దగ్గరి బాబుమియా రూ.2 వేలకు కిలో గంజాయిని కొని దాన్ని మహారాష్ట్రకు తీసుకొచ్చి రూ.10 వేలకు అమ్మేవాడు. 

ఇటీవల రంపచోడవరం వెళ్లిన బాబుమియా, షేక్ అజాజ్.. ధనును కలిసి 450 కిలోల గంజాయిని తీసుకున్నారు. బుధవారం రాత్రి గంజాయి ప్యాకెట్లతో ఇన్నోవా కారులో మహారాష్ట్రకు బయలుదేరారు. గంజాయి ట్రాన్స్ పోర్టు గురించి సమాచారం అందుకున్న హయత్ నగర్ పోలీసులు గురువారం ఉదయం పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఇన్నోవా కారును ఆపి తనిఖీ చేసి గంజాయిని గుర్తించారు. బాబు మియా, షేక్ అజాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. 450 కిలోల గంజాయి, కారు, రాడ్డు, 2 సెల్ ఫోన్లు, 20 వేల క్యాష్​ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. కోటి 2 లక్షలు ఉంటుందని సీపీ చౌహాన్ తెలిపారు. ఆయన వెంట ఎల్ బీనగర్ జోన్ డీసీపీ సాయి శ్రీ,  వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, హయత్ నగర్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీనివాసరావు  ఉన్నారు. 

పక్కా సమాచారంతో తనిఖీలు..

ఏపీ నుంచి సిటీ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని రాజేంద్రనగర్ ఎస్ వోటీ, శంకర్ పల్లి అరెస్ట్ చేశారు. గురువారం రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఆఫీసులో డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన సమీర్ ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని కొని మహారాష్ట్రకు తరలించేవాడు. అతడిపై ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోని పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. ఏపీలోని రాజమండ్రి నుంచి గంజాయిని  వెహికల్ లో తీసుకురావాలని మహారాష్ట్రలోని అమరావతికి చెందిన సయ్యద్ ఖాన్ షరీఫ్​ఖాన్(41), అకోలా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆదిల్(21)కు సమీర్ చెప్పాడు. గంజాయిని మహారాష్ట్రకు తీసుకొస్తే రూ.25 వేలు ఇస్తానని సమీర్ వారితో చెప్పాడు. ఇందుకు ఒప్పుకున్న షరీఫ్, ఆదిల్ బొలెరో వెహికల్ లో రాజమండ్రికి వెళ్లారు. అక్కడ 228 కిలోల గంజాయిని తీసుకుని దాన్ని 2 కిలోల చొప్పున 114 ప్యాకెట్లలో నింపారు. బొలెరో వెహికల్ లో కొబ్బరిబొండాలను పెట్టి వాటి మధ్యలో గంజాయి ప్యాకెట్లను ఉంచారు. 

బుధవారం రాత్రి రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు బయలుదేరారు. పెద్ద ఎత్తున గంజాయి సప్లయ్ అవుతున్నట్లు సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ వోటీ, రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎస్ వోటీ ఇన్ స్పెక్టర్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిఘా పెట్టారు. గురువారం ఉదయం 10 గంటలకు శంకర్ పల్లిలోని బీడీఎల్ చౌరస్తాలో బొలెరో వెహికల్ ను పట్టుకుని తనిఖీ చేశారు. కొబ్బరి బొండాల మధ్యలో గంజాయి ప్యాకెట్లను గుర్తించి రూ.59 లక్షల విలువైన 228 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నారు. షరీఫ్​, ఆదిల్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 సెల్ ఫోన్లు, బొలెరో వెహికల్ ను స్వాధీనం చేసుకున్నారు. డబ్బు ఆశతో గంజాయి ట్రాన్స్ పోర్టుకు ఒప్పుకున్నట్లు నిందితులు పోలీసులకు చెప్పారు. ప్రధాన నిందితుడు సమీర్ కోసం గాలిస్తున్నట్లు డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.