దేశ రాజధానిని ముంచెత్తిన భారీవర్షం..ఢిల్లీలో ఇది పరిస్థితి

దేశ రాజధానిని ముంచెత్తిన భారీవర్షం..ఢిల్లీలో ఇది పరిస్థితి

దేశ రాజధాని ఢిల్లీని భారీవర్షాలు అతలాకుతలం చేశాయి. నిన్నటినుంచి కురుస్తున్న వర్షాలకు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. డ్రైనేజీలు ఉప్పొంగాయి. అండర్ బైపాస్ లలో వాహనాలు మునిగిపోయాయి. కాలనీల్లో మోకాల్లోతు నీరు చేరింది. భారీ వర్షాలతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను దారి మళ్లించారు. ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో టర్మినల్ 1 పైకప్పు కూలింది. ఢిల్లీవీధులు చెరువులను తలపిస్తున్నాయి. 

ఆదివారం (మే25) కురిసిన వర్షాలకు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. న్యూఢిల్లీలోని సంత్ రవిదాస్ నగర్‌లో ఆదివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా రోడ్లపైకీ వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఢిల్లీలో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 70నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీవర్షం కారణంగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తన నీరు నిలిచిపోయింది. ఢిల్లీ కాంట్ ప్రాంతంలో వరదలతో అండర్‌పాస్‌లో ఓ బస్సు, కారు మునిగిపోయాయి.

ఢిల్లీలో మే నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌లోని 186.4 మి.మీ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇది నెలవారీ సగటు వర్షపాతం 21.9 మి.మీ కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ. మేలో ఇదే అత్యధిక వర్షపాతం. 2008లో 165 మి.మీ. వర్షపాతం నమోదైంది. 

 

ఢిల్లీలో శనివారం అర్థరాత్రి గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. నగరం అంతటా  కేవలం రెండు గంటల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. ఆదివారం తెల్లవారుజామున సప్దర్ జంగ్ లో 31 డిగ్రీలున్న ఉష్ణోగ్రత 21 డిగ్రీలకు తగ్గింది. 

మేనెలలో వర్షాల కారణంగా ఢిల్లీలో 12 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. 300కి పైగా చెట్లు కూలిపోయాయి. మౌలికసదుపాయాలు విస్తృతంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ అంతరాయం పెద్ద ఎత్తున ఏర్పడింది. రోడ్లు, కాలనీలు నీట మునిగాయి.

మరోవైపు ఆదివారం సాయంత్రం, రాత్రి సమయాల్లో ఢిల్లీలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రి 10.30 గంటలనుంచి 12.30 గంటల మధ్య 60నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు , భారీ వర్షం కురుస్తుందని రెడ్ అలెర్ట్ జారీ చేసింది.