కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద.. నిండుకుండలా నాగార్జునసాగర్

కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద.. నిండుకుండలా నాగార్జునసాగర్
  • లక్షన్నరకుపైగా క్యూసెక్కుల ఇన్​ఫ్లో.. నేడు ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్న మంత్రి ఉత్తమ్​
  • శ్రీశైలంలోకి దాదాపు 2 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో
  • శ్రీరాంసాగర్​కూ మొదలైన వరద 
  • ఆయకట్టు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

హైదరాబాద్​, వెలుగు:కృష్ణా నదికి వరద పోటెత్తుతున్నది. కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరుగుతున్నది. ఇటు గోదావరి బేసిన్​లోనూ వరద క్రమంగా పుంజుకుంటున్నది. శ్రీరాంసాగర్​ప్రాజెక్టులోకి ఒక్కరోజులోనే 6 టీఎంసీలకుపైగా నీళ్లు  వచ్చి చేరాయి. కృష్ణా బేసిన్​లో శ్రీశైలం ప్రాజెక్టుకు మూడు సోర్సుల ద్వారా నీళ్లు వస్తున్నాయి. సుంకేశుల, తుంగభద్ర, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా వస్తున్నది. దాదాపు 2 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి చేరుకుంటున్నది. 

దీంతో పోతిరెడ్డిపాడుకు 31 వేల క్యూసెక్కులు, నాగార్జునసాగర్​వైపు 1.50 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని ఆఫీసర్లు చెప్తున్నారు. మంగళవారం నాటికి ఇన్​ఫ్లోస్​ మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు.  వరద ప్రవాహాలు ఎక్కువగా ఉండడంతో మంగళవారం నాగార్జునసాగర్​ ప్రాజెక్టు గేట్లను ఎత్తేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మంగళవారం ఉదయం ప్రాజెక్టు గేట్లను తెరవనున్నారు. తొలుత ఆరు గేట్లను తెరవాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే ప్రవాహాలను బట్టి మరిన్ని గేట్ల ద్వారా నీటి విడుదలను పెంచే అవకాశాలున్నాయి. మరోవైపు శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు కూడా వరద క్రమంగా పెరుగుతున్నదిది. ఇన్నాళ్లూ ప్రాజెక్టుకు డ్రై స్పెల్​ కొనసాగగా.. ప్రస్తుతం 65 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది.  దీంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 

నారాయణపూర్​ నుంచి భారీగా..

కర్నాటకలోని కృష్ణా ప్రాజెక్టుల్లోకి వరద భారీగా చేరుతున్నది. ఆల్మట్టికి మునుపటి వరదే కొనసాగుతుండగా.. నారాయణపూర్​కు మాత్రం ఫ్లడ్​ ఇన్​ఫ్లోస్​ ఎక్కువ  నమోదవుతున్నాయి. ఆదివారం వరకు 50 వేల వరకే ఉన్న వరద ప్రవాహం.. ప్రస్తుతం లక్ష క్యూసెక్కులకుపైగా పెరిగింది. దీంతో అంతే మొత్తం లో దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల కు 1.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. లక్షన్నర క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తుంగభద్రకూ 76 వేల క్యూసెక్కులకుపైగా వరద వస్తుండడంతో లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు సుంకేశుల ప్రాజెక్టుకూ దాదాపు లక్ష క్యూసెక్కుల వరకు ఫ్లోస్​ ఉండగా.. అంతే కిందికి విడుదల చేస్తున్నారు. ఇలా.. శ్రీశైలం ప్రాజెక్టుకు మూడు సోర్సుల ద్వారా నీళ్లు వస్తున్నాయి. దీంతో ఏపీ కూడా చిన్న చిన్నగా పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలను పెంచుకుంటున్నది. 30 వేల క్యూసెక్కు ల నుంచి 31 వేల క్యూసెక్కులకు పెంచుకున్నట్లు అధికారులు చెప్తున్నారు.