
- 41 ఏండ్ల నాటి 2,039 టీఎంసీల రికార్డు బద్దలు
- ఈ సీజన్లో ఇప్పటివరకు 30 సార్లు గేట్లు ఓపెన్
- ఇంకా కొనసాగుతున్న వరద.. నవంబర్ వరకూ ఉండే చాన్స్
- పోతిరెడ్డిపాడు ద్వారా 200 టీఎంసీలకుపైగా ఏపీ వాడకం
- సాగర్‌లో కుడి, ఎడమ కాల్వల ద్వారా 200 టీఎంసీల వినియోగం
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. ఈ వర్షాకాలం సీజన్లో ఎన్నడూ లేని విధంగా జులై ప్రారంభం నుంచే కృష్ణా నదికి వరద ప్రవాహాలు నమోదయ్యాయి. ఎగువన మహారాష్ట్ర, కర్నాటకలోని కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో భారీ వరదలు వచ్చాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 41 ఏళ్ల రికార్డ్ స్థాయి వరద నమోదైంది. ఇప్పటిదాకా ప్రాజెక్టుకు 2133 టీఎంసీల వరద జలాలు వచ్చి చేరాయి. 1984లో చివరిసారిగా 2 వేల టీఎంసీల మార్క్‌ను శ్రీశైలం ప్రాజెక్టు దాటింది.
ఆ ఏడాది ప్రాజెక్టుకు 2039.87 టీఎంసీల వరద వచ్చింది. ఇప్పటివరకు అదే రికార్డ్ కాగా.. తాజాగా ఆ 41 ఏండ్ల రికార్డు బద్ధలైంది. కృష్ణా పరీవాహకంలో ఇప్పటికీ వరద ప్రవాహాలు నమోదవుతున్నాయి. నవంబర్ వరకూ వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే.. మరిన్ని రికార్డులు బ్రేక్ అవడం ఖాయమంటున్నారు. ప్రాజెక్టు గేట్లను ఇప్పటికే 30 సార్లు ఎత్తగా.. ప్రస్తుతం కూడా రెండు గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు.
పోతిరెడ్డిపాడు ద్వారా భారీగా జలాల తరలింపు
శ్రీశైలానికి భారీ వరద ప్రవాహాలు నమోదు కావడంతో.. ఈ ఏడాది ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ 200 టీఎంసీలకుపైగా జలాలను తరలించుకుపోయింది. శ్రీశైలం కెపాసిటీ 215 టీఎంసీలుకాగా.. అంత మేరకు ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచుతున్నారు. వచ్చిన వరదను వచ్చినట్టే కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా కరెంట్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు ప్రధాన గేట్ల ద్వారా సాగర్‌కు నీటిని రిలీజ్ చేస్తున్నారు.
ఏపీ విద్యుత్ కేంద్రం ద్వారా 260 టీఎంసీలు, తెలంగాణ విద్యుత్ కేంద్రం ద్వారా 340 టీఎంసీలను వాడి కరెంట్‌ను ఉత్పత్తి చేశారు. దాంతోపాటు గేట్ల ద్వారా మరో 1200 టీఎంసీలను దిగువన ఉన్న సాగర్‌కు రిలీజ్ చేశారు. మొత్తంగా సాగర్ ప్రాజెక్టుకు 1800 టీఎంసీల దాకా వరద వచ్చింది. మరోవైపు సాగర్ ప్రాజెక్టులోనూ కుడి, ఎడమ కాల్వల ద్వారా 200 టీఎంసీల జలాల వినియోగం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.
వరద హెచ్చరికలు ఇంకా ఉన్నయ్
కృష్ణా ప్రాజెక్టులకు వరద వార్నింగ్స్ ఇంకా ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అప్పర్ భీమా, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం పోటెత్తుతుందని అంటున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ మధ్యలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా తెలుస్తున్నది. ఆ ఏరియాను రెడ్ జోన్లో పెట్టారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు ఇంకా లక్ష క్యూసెక్కుల దాకా వరద వస్తున్నది.
ఇటు జూరాలకు 85 వేలు, సాగర్‌కు 83 వేల క్యూసెక్కుల చొప్పున ఇన్‌ఫ్లోస్ నమోదవుతున్నాయి. గోదావరి పరీవాహకంలోనూ వరద ప్రవాహాలు రికార్డు అవుతున్నాయి. ఎల్లంపల్లికి లక్ష క్యూసెక్కులు, శ్రీరాంసాగర్‌కు 75 వేలు, నిజాంసాగర్‌కు 42 వేల క్యూసెక్కుల చొప్పున వరద వస్తున్నది.