ఢిల్లీలో పెరిగిన ఎండలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు ఢీల్లీతోపాటు హర్యానా, పంజాబ్ లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర భారతంలో నిన్నటివరకు రెడ్ అలర్ట్ ఉన్నప్పటికీ.. దాన్ని ఉరెంజ్ అలర్ట్ గా మార్చింది వాతావరణ శాఖ. జూన్ 30వరకు ఢిల్లీని నైరుతి రుతుపవనాలు చేరే అవకాశం ఉందంది ఐఎండీ. ఎండల తీవ్రత పెరగడంతో ఢిల్లీ ప్రజలు నీళ్ల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
హీట్ వేవ్ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.గత నెలరోజులుగా ఉష్ణోగ్రతలు ఢిల్లీలో గరిష్టంగా 45 డిగ్రీలకు దాటి పోతున్నాయి. దీనికితోడు ఢిల్లీలో నీటి కొరత ఏర్పడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
గత రెండు రోజుల్లో ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌లో ఐదుగురు చనిపోయారు. మరో 12 మంది కండీషన్ సీరియస్ గా ఉంది. అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లా హాస్పిటల్ లో కూడా హీట్ వేవ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రెండు రోజుల్లోనే 15 మంది మృతి చెందారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో రాబోయే 24 గంటలపాటు వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం తన సూచనలో పేర్కొంది.

