కిలోల కిలోలు బంగారం, డైమండ్స్ కొని పడేశారు.. అక్షయ తృతీయలో రికార్డ్స్

కిలోల కిలోలు బంగారం, డైమండ్స్ కొని పడేశారు.. అక్షయ తృతీయలో  రికార్డ్స్

అక్షయ తృతీయను హిందువులు  అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తుంటారు. ఆ  రోజున  బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని అభిప్రాయపడుతుంటారు. ఈ ఏడాది కూడా  దేశవ్యాప్తంగా బంగారం, వెండి అమ్మకాలు జోరుగా సాగాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అయితే కిలోల కిలోలు బంగారం, డైమండ్స్ కొనిపడేశారు. బంగారం కొనుగోలు విషయంలో గతేడాది రికార్డును అక్కడి ప్రజలు బద్దలు కొట్టారు. 

ఉత్తరప్రదేశ్ బులియన్ అసోసియేషన్ వెల్లడించిన లెక్కల ప్రకారం 2022లో అక్షయ తృతీయ రోజున లక్నోలో రూ.14 కోట్ల 83 లక్షల విలువైన బంగారం అమ్ముడవగా, 2023లో అక్షయ తృతీయ రోజున దాదాపు 18 కోట్ల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశారు. అంతేకాకుండా 220 కిలోల వరకు వెండి ఆభరణాలు విక్రయించారు. వీటి ధర రూ.1 కోటి 80 లక్షలు. 

ఈ సంవత్సరం ముఖ్యంగా యువత బంగారం,వెండితో పోలిస్తే అక్షయ తృతీయ రోజున వజ్రాలను ఎక్కువగా కొనుగోలు చేశారు. లక్నోలో ఈ ఏడాది తొలిసారిగా వజ్రాల వ్యాపారం కూడా పెరిగింది. అక్షయ తృతీయ రోజున నగరవాసులు రూ.4 కోట్ల 50 లక్షల విలువైన వజ్రాభరణాలను కొనుగోలు చేశారని  చౌక్ సరాఫా అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆదిష్ జైన్  వెల్లడించారు.   

దీంతో లక్నో బులియన్ మార్కెట్ చాలా కాలం తర్వాత మరోసారి ఊపందుకుందని ఆదిష్ జైన్ అన్నారు.  అక్షయ తృతీయ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ.62,500గా, వెండి కిలో ధర రూ.74,500గా ఉంది.