గ్రేటర్‌ను ముంచెత్తిన వర్షం

గ్రేటర్‌ను ముంచెత్తిన వర్షం

హైదరాబాద్, వెలుగు: భారీ వాన నగరాన్ని మరోసారి అతలాకుతలం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా 4 గంటలపాటు కుండపోతగా కురిసింది. వారం కిందటి భారీ వర్షాల నుంచి తేరుకోకముందే మరోసారి దంచి కొట్టిన వాన దెబ్బకు అనేక బస్తీలు, కాలనీలు నీట మునిగాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. సరూర్​నగర్, ఉప్పల్, అంబర్​పేట్ లలో ఏకంగా 10 సెంటీమీటర్లకు పైగా వాన కురిసింది! రోడ్లపై భారీగా వరద నీరు చేరి బెంబెలెత్తించింది. పలు కాలనీలనూ ముంచెత్తింది. దాంతో జనం అందినకాడికి వస్తువులు, పిల్లలను తీసుకుని పరుగులు తీశారు. దసరా సెలవులతో జీహెచ్ఎంసీ సిబ్బంది అనుకున్నంత తొందరగా అలర్ట్​కాకపోవడంతో వరద కాలనీలను ముంచెత్తింది. జీహెచ్ఎంసీ అధికారులు ఎమర్జెన్సీ బృందాలను రంగంలో దించారు. రాష్ట్రంలో పలు ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షం నమోదైంది. రంగారెడ్డి జిల్లా షాబాద్‌‌‌‌‌‌‌‌లో 9.6, మేడ్చల్‌‌‌‌‌‌‌‌ మల్కాజిగిరి సింగపూర్‌‌‌‌‌‌‌‌, సూర్యాపేట నాగారంలలో 9.5, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో 8.9 సెం.మీ. వర్షపాతం రికార్డయింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతవరణ శాఖ హెచ్చరించింది. జనం ఇళ్లల్లోంచి బయటకు రావద్దని సూచించింది.

నాలుగు గంటలు ఏకధాటిగా

అల్పపీడన ప్రభావంతో నాలుగు గంటలు ఏకధాటిగా సిటీలో ఉరుములు మెరుపులతో వాన దంచికొట్టింది. శివారు ప్రాంతాలు సరూర్​నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, ఉప్పల్ తో పాటు అంబర్​పేట, బతుకమ్మకుంట కాలనీ, మారుతీనగర్,  హియాయత్​నగర్, మలక్​పేట, నాచారం తదితర చోట్ల చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వనస్థలిపురం పనామా చౌరస్తా నుంచి ఎల్బీనగర్ రోడ్డుపై భారీగా వరద చేరి కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. దిల్​సుఖ్​నగర్​లోని కమలానగర్​ కాలనీలో భారీగా వరద ఉప్పోంగింది. అనేక కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఓల్డ్​సీటీలోనూ లోతట్టు ప్రాంతాలు మునిగాయి. పద్మారావునగర్​ నుంచి చిలకలగూడ వెళ్లే దారిలో భారీ వర్షంలో గుంతలో బైక్​తో సహ పడిన ఓ వ్యక్తిని ట్రాఫిక్​పోలీసులు కాపాడారు.

నేడూ భారీ వర్షాలే!

రాష్ట్రంలో పలు చోట్ల ఆదివారం కూడా భారీ వానలు పడొచ్చని  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వాతావరణ కేంద్రం చెప్పింది.  నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో నల్గొండ జిల్లాదాకా తిరోగమించాయని తెలిపింది.

అలర్ట్​గా ఉండండి: జీహెచ్ఎంసీ

భారీ వానలున్నందున ఇబ్బందులొచ్చినా, ఏ అవసరమున్నా జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040–21111111, 040–29555500 టోల్​ఫ్రీ నంబర్లలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. మరో రెండు రోజులు భారీ వర్ష సూచనలు ఉండటంతో ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దించారు. వరద నీటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.